విజయవాడలో కోవిడ్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళా కరోనా లక్షణాలతో బాధపడుతూ విజయవాడ కోవిడ్ హాస్పిటల్ లో చేరింది. పాజిటివ్ గా తేలడంతో అక్కడే చికిత్స పొందింది. అయితే ఆమె కరోనా నుండి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతంగా వుండటంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు.

అయితే కరోనా భయంలో ఆమె కుటుంబసభ్యులు  ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ఆమె అదే హాస్పిటల్ రెండో అంతస్తునుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 

వెంటనే స్పందించిన హాస్పిటల్ సిబ్బంది ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే వున్నట్లు సమాచారం. సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. కరోనా నుండి బయటపడ్డా కుటుంబం ఆదరించకపోవడమే ఆత్మహత్యకు కారణమా లేక ఇంకా ఏదయినా కారణాలున్నాయా అనేది తెలియాల్సి వుంది. 
 

read more  పాపం డ్రైవరన్న... వైద్యానికి హాస్పిటల్స్, అంత్యక్రియలకు కుటుంబం నిరాకరణ

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులో పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కరోనా కేసులపై బులిటెన్ విడుదల చేసింది. ఒక్క రోజులో ఏపీలో పది వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,167 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 68 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 30557కు చేరుకుంది. రాష్ట్రంలో సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 1281కి చేరుకుంది. 

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గత 24 గంటల్లో 1441 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా విశాఖపట్నంలో ఒక్క రోజులో 1223 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కర్నూలు జిల్లాలో 1252 కేసులు రికార్డయ్యాయి. 
అనంతపురం జిల్లాలో 954, చిత్తూరు జిల్లాలో 509, గుంటూరు జిల్లాలో 946, కడప జిల్లాలో 753 కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లలో 271, నెల్లూరు జిల్లాలో 702, ప్రకాశం జిల్లాలో 318, శ్రీకాకుళం జిల్లాలో 586, విజయనగరం జిల్లాలో 214, పశ్చిమ గోదావరి జిల్లాలో 998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మరణించారు. చిత్తూరు, కడప జిల్లాల్లో ఆరుగురేసి మరణించారు.  ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు మరణించారు నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరేసి మృత్యువాత పడ్డారు. 

ఏపీలో జిల్లాలవారీగా మొత్తం కరోనా వైరస్ కేసులు, మరణాలు

అనంతపురం 13312, మరణాలు 105
చిత్తూరు 9589, మరణాలు 101
తూర్పు గోదావరి 19180, మరణాలు 157
గుంటూరు 13762, మరణాలు 121
కడప 7230, మరమాలు 42
కృష్ణా 6530, మరణాలు 180
కర్నూలు 15723, మరణాలు 187
నెల్లూరు 6455, మరణాలు 38
ప్రకాశం 4761, మరణాలు 57
శ్రీకాకుళం 6168, మరణాలు 66
విశాఖపట్నం 9782, మరణాలు 100
విజయనగరం 3816, మరణాలు 55
పశ్చిమ గోదావరి 11354, మరణాలు 92