కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఈ వైరస్ తీసే ప్రాణాల సంగతి పక్కన పెడితే.. దీని కారణంగా మనుషుల మధ్య ప్రేమాభిమానాలు చచ్చిపోతున్నాయనే అనుమానం కలుగుతోంది. కట్టుకున్న భర్త, భార్య, కన్న తల్లి, తండ్రి అనే తేడా లేకుండా వైరస్ రాగానే ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన తూర్పుగోదావరి జిల్లా కరపలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన ఓ వ్యక్తి(55) ఇటీవల డయాలసిస్ చేయించుకున్నారు. అయితే.. రెండు రోజుల క్రితం ఎందుకైనా మంచిదని అతనికి కరోనా పరీక్షలు చేయించారు. దాని ఫలితం రాకుండానే గురువారం సాయంత్రం ఆస్పత్రి నుంచి తన భార్యతో కలిసి బస్సులో రామచంద్రాపురానికి వెళ్లేందుకు బయలు దేరాడు.

ఫలితం వచ్చేవరకు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించినా.. వీరు వినిపించుకోకుండా బయలు దేరి వెళ్లిపోయారు. వీరు బస్సులో ఉండగానే.. కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. ఈ విషయం కాస్త బస్సులోని డ్రైవర్, కండక్టర్ కి తెలీడంతో.. ఆ దంపతులు ఇద్దరినీ బస్సులో నుంచి దించేశారు. అయితే.. బస్సు దిగిన తర్వాత.. సదరు వ్యక్తిని అక్కడే వదిలేసి అతని భార్య వెళ్లిపోవడం గమనార్హం.

బాధితుడు ఒక్కడే నిస్సహాయ స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో.. వారు అతనిని కాకినాడ జీజీహెచ్ కి తరలించారు.