గుంటూరు జిల్లాలోని లింగంగుంట్లకు చెందిన ఓ మహిళ చీరాలలోని ఓ ఫంక్షన్ కు ఇవాళ వెళ్లింది. అయితే శుభకార్యానికి వెళ్లే ముందు ఆమె తన ఏడేళ్ల కొడుకు కరీముల్లాను తన చెల్లె ఆసియాకు అప్పగించి వెళ్లింది.

ఏమైందో ఏమో తెలియదు కానీ ఏడేళ్ల కరీముల్లాను ఆసియా కత్తితో అతి దారుణంగా హత్య చేసింది. విచక్షణ రహితంగా పొడవడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. కత్తితో పొడవడంతో వచ్చిన రక్తాన్ని ముఖానికి పూసుకొంది.

ఆ తర్వాత అరుస్తూ ఆమె తన చేతిలో కత్తి పట్టుకొని బయటకు వచ్చింది. ఆమెను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆమెను పట్టుకొనేందుకు ప్రయత్నించిన వారిపై కత్తితో దాడికి ప్రయత్నించింది. అత్యంత ధైర్యంగా కొందరు ఆమెను చాకచక్యంగా పట్టుకొన్నారు.

రెండు చేతులు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీముల్లా మరణించిన విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.విగతజీవిగా పడి ఉన్న కొడుకును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మతిస్థిమితం లేని కారణంగానే ఆసియా కరీముల్లాను చంపిందని చెబుతున్నారు. అయితే మతిస్థిమితం లేని సోదరి వద్ద కొడుకును ఆమె ఎందుకు వదిలివెళ్లిందనే ప్రశ్నించేవారు కూడ లేకపోలేదు.