తమ్ముడి భార్యను కూతురిలాగా భావించే సమాజం మనది. అలాంటి మరదలితో ఓ బావగారు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సొంత తమ్ముడికే ద్రోహం చేశాడు. అక్కడితో ఆగకుండా.. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత తమ్ముడినే చంపేశాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన పారబత్తిన దుర్గా ప్రసన్న సెంట్రింగ్ పని చేస్తుంటాడు.  అతని తమ్ముడు పారబత్తిన సీతారామాంజనేయులు(27) కి పెళ్లై భార్య లక్ష్మి ఉంది. కాగా..  లక్ష్మితో దుర్గా ప్రసన్న వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే..  భార్యపై సీతారామాంజనేయులకు అనుమానం కలిగింది. దీంతో.. మద్యం సేవించివచ్చి భార్య ను కొట్టేవాడు.

దీంతో..  తన భర్తను చంపేస్తే.. బావగారితో సంతోషంగా జీవించవచ్చని ఆమె భావించింది. ఈ విషయాన్ని అతనికి కూడా చెప్పింది. దీంతో.. దుర్గా ప్రసన్న కూడా తమ్ముడిని చంపడానికి అంగీకరించాడు. ఇద్దరు పథకం ప్రకారం ఆగస్టు 21వ తేదీ రాత్రి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి.. మరో ఇద్దరు స్నేహితుల సహాయంతో.. ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు.

అనంతరం శవాన్ని తుమ్మ చెట్టుకు కండువాతో కట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు. కరోనా కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులను నమ్మించడానికి  మందులు, గ్లౌజులు పడేశారు. అయితే.. పోలీసులకు అది ఆత్మహత్య కాదనే అనుమానం కలగడంతో.. దర్యాప్తు చేశారు. తమదైన శైలిలో దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు.