ఓ యువతి పీకలదాకా మరో యువకుడిని ప్రేమించింది. అయితే.. ఆ ప్రేమను.. అతనితో పెళ్లిని తల్లి నిరాకరించింది. అంతే.. తమ పెళ్లికి తల్లి అడ్డుపడిందనే కోపంతో.. ఆ యువతి.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది. ఈ సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ నెల 6వ తేదీన లక్ష్మీ(40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మృతిచెందినట్లు కేసు నమోదైంది. వైద్యులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కూడా కూపీ లాగారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.

లక్ష్మి కుమార్తె రూపశ్రీ.. వరుణ్ సాయి అనే  యువకుడిని ప్రేమించింది. వారి ప్రేమను లక్ష్మి అంగీకరించలేదు. దీంతో... ప్రియుడు వరుణ్ సాయితో కలిసి  పెళ్లికి అడ్డు  చెప్పినందుకు తల్లిని చంపాలని రూపశ్రీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని ప్రియుడి సాయంతో దిండుతో అదిమిపెట్టి చంపే ప్రయత్నం చేసింది.

చనిపోయిందని భావించడంతో ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోగా... రూపశ్రీ ఏమీ తెలియనట్లు తండ్రికి సమాచారం ఇచ్చింది. కిందపడి తల్లి చనిపోయిందంటూ సహజ మరణంగా నమ్మబలికింది. అయితే.. తండ్రి ఓ ఆర్ఎంపీ వైద్యుడికి సమాచారం అందించడంతో.. అతను వచ్చి లక్ష్మి ఇంకా ప్రాణాలతోనే ఉందని గుర్తించారు. వెంటనే విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.