గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ మహిళ అత్యంత దారుణానికి పాల్పడింది.. ప్రియుడితో కలిసి తన అన్నయ్యను చంపింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని బేతపూడి పరిధి రేగులగడ్డకు చెందిన గంజి పోతురాజు (40) ఈ నెల 19వ తేదీన హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఫిరంగిపురం పోలీసు స్టేషన్ ఇంచార్జీ సీఐ కరుణాకరరావు, ఎస్సై సురేష్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. 

రేగులగడ్డకు చెందిన గంజి సాంబయ్య, నాగమ్మ దంపతులకు పోతురాజు, ఆదిలక్ష్మి అనే సంతానం ఉన్నారు పోతురాజుకు సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన వీరమ్మతో పెళ్లి కాగా, మద్యానికి బానిస కావడంతో వీరమ్మ పుట్టింట్లోనే ఉంటోంది. ఆదిలక్ష్మికి అమరావతి మండలం అత్తలూరుకుకు చెదిన తిరులకొండ నాగరాజుతో పెళ్లయింది. ఇరువురి మధ్య విభేదాలు రావడంతో ఆమె కూడా రేగులగడ్డలోని పుట్టింట్లోనే ఉంటోంది. 

ఆదిలక్ష్మికి రేగులగడ్డ గ్రామానికి చెందిన చారల సాంబయ్యతో వివాహేతరం ఏర్పడింది. ఇది మనసులో పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోవాలని పోతురాజు ఆదిలక్ష్మిపై ఒత్తిడి పెడుతూ వచ్చాడు. ఆస్తి ఇవ్వాలని ఇంట్లోవారిపై బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి పోతురాజు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆస్తి కావాలని ఇంట్లోవారితో గొడవ పెట్టుకున్నాడు. 

ఆదిలక్ష్మి ప్రియుడు సాంబయ్య, పోతురాజు గొడవపడ్డారు. ఇద్దరు పరస్పరం కొట్టుకుంటున్న సమయంలో పోతురాజు కింద పడ్డాడు. అతని తలకు గాయమైంది. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. 

అయితే, పోతురాజు ఏమైనా చేస్తాడని ఆదిలక్ష్మి, సాంబయ్య భయపడ్డారు. నిద్రపోతున్న పోతురాజు తలపై రోకలిబండతో ఆదిలక్ష్మి కొట్టింది. తలకు గాయం కావడంతో పోతురాజు మరణించాడు. ఆదిలక్ష్మికి సాంబయ్య సహకరించాడని తేలింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.