ఓ బధిర మహిళను కిడ్నాప్ చేసి, నెల రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. బాధిత మహిళ ఏపీలోని కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందినది. అయితే ఆమెపై కరీంగనర్ లో లైంగిక దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. వారిపై లైంగిక దాడులు ఆగడం లేదు. తరచూ అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్నారులు అని కూడా చూడకుండా కొందరు కామాంధులు వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ బధిర మహిళపై నెల రోజుల పాటు అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కరీంనగర్ లో చోటు చేసుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలు తలదించుకునే ఘటన ఇది. ఓ బధిర (మూగ, చెవుడు) మహిళను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నెల రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం కృష్ణా జిల్లా (krishna district) మచిలీపట్నం (machilipatnam) ప్రాంతానికి చెందిన ఓ మహిళకు మాటలు రావు, చెవులు కూడా వినిపించవు. అయితే ఆమె గత నెల 4వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత నెల 21 తేదీన ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయినా వారికి ఈ మహిళ జాడ కనిపించలేదు.
ఈ నెల 9వ తేదీన ఆ మహిళ తన కూతురుకు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లోకేషన్ (location) కనుకున్నారు. బాధిత మహిళ కరీంనగర్ లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు కరీంనగర్ వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ బాధిత మహిళ తన సోదరుడితో సైగల ద్వారా ఓ విషయాన్ని చెప్పింది. తనను కిడ్నాప్ చేసి ఉంచారని, లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె వివరించింది.
దీంతో ఏపీ పోలీసులు ఈ నెల 18వ తేదీన కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉండే కొంత మంది వ్యక్తులను అనుమానించి, అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తరువాత ఆ కేసు విచారణలో భాగంగా ఇనగూడురు సీఐ కొండయ్య, ఇతర పోలీసులు సిబ్బంది కలిసి సోమవారం తెలంగాణ (telangana)లోని కరీంనగర్ జిల్లా (karimnagar district) కు చేరుకున్నారు. బస్టాండ్ (bus stand) ఆవరణలో, కరీంనగర్ మున్సిపాలిటీ ఆఫీసు (municipality office) ప్రాంతంలో కొంత మందిని ప్రశ్నించారు. ఆ మహిళ దాదాపు ఇరవై రోజులు ఆ ప్రాంతంలోనే తిరుగుతూ కనిపించిందని అక్కడి వ్యక్తులు పోలీసులకు చెప్పారు.
అయితే ఈ కేసులో బాధిత మహిళను అపహరించి, లైంగిక దాడికి పాల్పడిన విషయం నిజమేనా ? అనే విషయాన్ని పోలీసులు తెలియజేయడం లేదు. గత నెల 4వ తేదీన కనిపించకుండా పోయిన మహిళ కరీంనగర్ కు ఎలా వచ్చింది ? ఆ మహిళ వద్ద మొబైల్ ఉన్నప్పటికీ ఆమె ఫోన్ చేసేంత వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదనే ప్రశ్నలకు జవాబులు ఇంకా తెలియడం లేదు.
