తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాల పర్యవేక్షకులు అనారోగ్యానికి గురవ్వడం  సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి తెలిపారు. మరోవైపు కోవిడ్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్ంయలో తిరుమలలో దర్శనాలు నిలిపివేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.

Also Read:టీటీడీలో కరోనా టెర్రర్... 170మందికి పాజిటివ్

దీనిపై ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ట్విట్టర్‌లో స్పందించారు. కొన్ని వారాల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేయాలని ఆయన సూచించారు. అలాగే శ్రీవారి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని.. అందువల్ల వారిని సంరక్షించి, స్వామి వారికి ఏకాంతంగా పూజలు నిర్వహించాలని రమణ దీక్షితులు కోరారు.

అటు దర్శనాలు నిలిపివేయడం అందరకీ శ్రేయస్కరమని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాశ్ అన్నారు. అర్చకులు, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో 83 రోజులు కైంకర్యాలు ఎలా నిర్వహించారో అదే  విధానాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవ్వాలని ఆయన సూచించారు.