అమరావతి: హీరో ప్రభాస్ బాబాయ్ కృష్ణంరాజు బిజెపిలో ఉన్నారు. దీంతో ప్రభాస్ వచ్చే ఎన్నికల్లో బిజెపి తమ ప్రచారానికి వాడుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మాజీ కేంద్ర మంత్రి అయిన కృష్ణంరాజు మాట మరో విధంగా ఉంది.  

ప్రభాస్‌ ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాడని, అతన్ని బీజేపీ ఎన్నికల ప్రచారంలో వినియోగించదలచుకోలేదని కృష్ణం రాజు చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్‌ సోమవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

ప్రభాస్‌ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. ప్రజలను మోసం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతోందని, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు అడుగుతుంటే లేఖలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ అగ్రనాయకత్వం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధమని చెప్పారు. 

1998 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికన్నా, బీజేపీతో కలసి పోటీ చేసిన 1999 ఎన్నికల్లోనే టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని, బీజేపీ వల్ల నష్టపోయామని టీడీపి అసత్యాలను ప్రచారం చేస్తోందని కృష్ణం రాజు అన్నారు.