పవన్ మాటలు విన్నవారికి చంద్రబాబు- పవన్ మధ్య  చిచ్చు మొదలైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అవసరమైతే తాను ఎవరినీ లెక్కచేయనని తాజాగా చంద్రబాబును హెచ్చరించటం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

ప్రత్యేకహోదా కోసం చంద్రబాబునాయుడు రాజీపడ్దారని పవన్ కల్యాణ్ బాంబు పేల్చారు. కాబట్టి హోదా సాధన కోసం త్వరలో రోడ్డెక్కుతననే సూచనలు పవన్ చేసారు. దాంతో చంద్రబాబుతో విభేదించటానికి పవన్ సిద్ధపడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పవన్ మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తుంటే భవిష్యత్తు రాజకీయాలపై ఎన్నో ఊహాగాలను పవన్ ప్రజలకు వదిలిపెట్టారు. పవన్ మాటలు విన్నవారికి చంద్రబాబు- పవన్ మధ్య చిచ్చు మొదలైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

అవసరమైతే తాను ఎవరినీ లెక్కచేయనని తాజాగా చంద్రబాబును హెచ్చరించటం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రజా సంక్షేమం కోసం అన్నయ్య చిరంజీవితో పాటు కుటుంబాన్నే వదులుకున్నవాడిని అని చెప్పటం చూస్తుంటేనే చంద్రబాబును వదిలేయటం తనకు లెక్కేకాదని చెప్పకనే చెప్పారు. అదేసమయంలో ప్రత్యకహోదా సాధన కోసం త్వరంలోనే రోడ్డెక్కుతానని హెచ్చరించటం టిడిపిలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

రిపబ్లిక్ డే ఉద్యమంలో పవన్ ఎక్కడా కనబడకపోవటంతో చంద్రబాబే జనసేన అధ్యక్షుడు పవన్ను నడిపిస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే, తాజాగా పవన్ మాట్లాడిన తీరు చూస్తుంటే భిన్నంగా ఉంది. పవన్ ఏకకాలంలో ఇటు ప్రధానమంత్రి నరేంద్రమోడి, వెంకయ్యనాయడులతో పాటు చంద్రబాబు మీద కూడా ధ్వజమెత్తటం గమనించాలి. మోడి, చంద్రబాబులపై పవన్ విరుచుకుపడటం ఇదే మొదటిసారి.

విలువల గురించి మాట్లాడే సమయంలో తరచూ సింగపూర్ దివంగత ప్రధాని లీక్యూ వాన్ గురించి ప్రస్తావించే చంద్రబాబు ఆర్ధిక నేరగాళ్ళైన సుజనాచౌదరి, రాయపాటి సాంబశివరావు లాంటి వారిని పక్కన ఎలాపెట్టుకుంటారని సూటిగా ప్రశ్నించారు. వారిపై జ్యుడీషియల్ కమిటితో విచారణ జరపించాలని డిమాండ్ చేయటం టిడిపికి మింగుడుపడనిదే. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే చంద్రబాబును కూడా వదిలేస్తానని తీవ్రంగా హెచ్చరించారు.

ప్రత్యేకహోదా కోసం యువత చేసిన ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయటాన్ని పవన్ తీవ్రంగా ఖండించారు. తాత్కాలికంగా ఉద్యమాలను అణిచగలరేగానీ శాశ్వతంగా కాదన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయలేకపోతే ఉద్యమం చేసే వారిని వెనక్కు లాగవద్దని గట్టిగా చెప్పారు. కనీసం గంటపాటైనా ఉద్యమం చేసుకునేందుకు యువతకు అవకాశం ఇచ్చి ఉండాలన్నారు. అయితే, ఉద్యమం అంటేనే పర్మీషన్ తో చేసేది కాదన్న విషయం పవన్కు తెలీదా?

అలాగే, నోట్ల రద్దుపై పలుమార్లు మాటమార్చినట్లుగానే ప్రత్యేకహోదా విషయంలో కూడా పలుమార్లు చంద్రబాబు మాట మార్చటాన్ని పవన్ తప్పుపట్టారు. ప్రజల కోస ఎవరితోనైనా విభేదించగలను అని చెప్పటంతోనే భవిష్యత్ రాజకీయాలపై ఇంకా సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించటం, చంద్రబాబు స్వాగతించటాన్ని పవన్ తప్పుపట్టారు. ప్యాకేజి వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదన్పారు. ప్యాాకేజి విషయంలో కేంద్రం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చిందని పవన్ చెప్పటం గమనార్హం.