టెక్నాలజీనే 2019లో కొంప ముంచేస్తుందా ?

First Published 26, Nov 2017, 9:06 AM IST
Will Naidus technology help tdp to come to power again
Highlights
  • చంద్రబాబునాయుడు పటిస్తున్న టెక్నాలజీ మంత్రమే వచ్చే ఎన్నికల్లో పార్టీ కొంపముంచుతుందా?
  • క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అదే అనుమానాలు వస్తున్నాయి.

చంద్రబాబునాయుడు పటిస్తున్న టెక్నాలజీ మంత్రమే వచ్చే ఎన్నికల్లో పార్టీ కొంపముంచుతుందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అదే అనుమానాలు వస్తున్నాయి. టెక్నాలజీ ఫలితాలు జనాలకు ఎంత వరకూ అందుబాటులోకి వస్తున్నాయో గమనించకుండా నిత్యం టెక్నాలజీ మంత్రాన్నే జపిస్తుంటే ఉపయోగం లేదన్నది పలువురి భావన. అందుకే సిఎం పటిస్తున్న టెక్నాలజీ మంత్రాన్ని మంత్రులు, ఎంఎల్ఏలు, ఉన్నతాధికారులు, సిబ్బంది అందరూ వ్యతరేకిస్తున్నారు.  

అన్నీ సమస్యలకు టెక్నాలజీనే మందు అన్నది చంద్రబాబు నమ్మిన సిద్దాంతం. ‘బియ్యానికి-పిడుగు’కు ఒకే మంత్రం పనికి రాదన్నది మిగిలిన వాళ్ళ వాదన. సరే, మిగిలిన వాళ్ళ వాదన నిలబడదనుకోండి అది వేరే సంగతి. ఫిర్యాదుల పరిష్కార వేదిక అంటూ 1100 ఫోన్ నెంబర్ ను ఇచ్చారు. దానికి రోజూ వేలాది కాల్స్ వస్తున్నాయి. వేలాది కాల్స్ వస్తున్నాయంటేనే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్ధాయిలో పేరుకుపోయిందో అర్ధమైపోతోంది.

భూరికార్డులను ఆన్ లైన్లో ఉంచాలన్న ఆలోచన మంచిదే. కానీ ఆ వ్యవస్ధను సక్రమంగ పనిచేయించే యంత్రాంగాన్ని సమకూర్చ లేదు. ఫలితంగా తమ వద్దున్న పాస్ పుస్తకాల్లోని సమాచారానికి, ఆన్ లైన్లోని సమాచారానికి చాలా తేడా ఉండదని రోజూ వేలాది ఫిర్యాదులొస్తున్నాయి. వాటిని సరిచేసేందుకు సర్వేయర్లు లేరు. దాంతో రైతులు, భూ యజమానులు మూడున్నరేళ్ళుగా నానా అవస్తులు పడుతున్నారు.

టెక్నాలజీ ద్వారా ఫలితాలు ప్రజలకు త్వరగా అందించాలన్న సిఎం కృషి ప్రశంసనీయమే. కానీ అందుకు తగ్గ వ్యవస్ధను ముందు ఏర్పాటు చేసుకోవాలన్న విషయాన్ని మరచిపోయారు. రాబోయేది ఎన్నికల కాలం కాబట్టి టెక్నాలజీని నమ్ముకుంటే దెబ్బ తినేస్తామని మంత్రులు, ఎంఎల్ఏలు ఆందోళన పడుతున్నారు. బిందు సేధ్యం, తుంపర సేధ్యం క్రింద రైతులకు పోయిన ఏడాది ప్రభుత్వం రూ. 1000 కోట్లు ఇచ్చింది. అయితే, స్ధానిక ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండానే ఆయా రైతుల ఖాతాల్లో రాయితీలు పడిపోయాయి. దాంతో లబ్దిపొందిన రైతులు ఎవరో కూడా ఎంఎల్ఏలకు తెలీటం లేదట. ఎంఎల్ఏల ద్వారా పనులు జరిగితే రేపు ఎన్నికల్లో తాము ఓట్లు అడిగే వీలుంటుందన్నది వాళ్ళ ఆలోచన.  

మొత్తం మీద టెక్నాలజీని మాత్రమే నమ్ముకుంటే 2019 ఎన్నికల్లో ముణిగిపోవటం ఖాయమన్న ఆందోళన మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల్లో స్పష్టంగా కనబడుతోంది. కాబట్టే టెక్నాలజీ అనే భ్రమల్లో నుండి చంద్రబాబు వాస్తవిక ప్రపంచంలోకి రావాలని నేతలు మొత్తుకుంటున్నారు.

loader