ఎవరైనా కోర్టుకు వెళ్ళి స్పష్టమైన ఆదేశాలు తీసుకువస్తే తప్ప ఎన్నికల నిర్వహణ గురించి ప్రభుత్వం ఆలోచించనుగాక ఆలోచించదు.
మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అందరికీ ఓ అనుమానం మొదలైంది. స్ధానిక సంస్ధలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ స్ధానాలకు ఎంఎల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే కదా? ఓట్లు వేయించుకున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎలాగో ఒకలా మూడు స్ధానాల్లోనూ గెలిచేసామని టిడిపి అనిపించుకున్నది. ప్రజలు ఓట్లేసిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల్లో మాత్రం బోర్లా పడింది. టిడిపి పోటీ చేసిన నాలుగు స్ధానాల్లోనూ ఓడిపోయింది.
ఇపుడు అందరిలోనూ మొదలైన అనుమానం ఏంటంటే క్కడే పెండింగ్ లో ఉన్న మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుందా? అని. రాష్ట్రం మొత్తం మీద 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాలి. అందులో 6 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలున్నాయి. తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, ఒంగోలు, గుంటూరు కార్పొరేషన్లకు చాలాకాలంగా ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో రెండు, విజయనగరం జిల్లాలో రెండు, ప్రకాశం జిల్లాలో ఒక నగరపాలక సంస్ధకు ఎన్నికలు జరగాలి.
మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మున్సిపల్ ఎన్నికలు జరిపేది అనుమానమే అని అందరికీ అర్ధమైపోతోంది. ఎందుకంటే మధ్య తరగతి వర్గాలు ప్రభుత్వంపై బాగా వ్యతిరేకతతో ఉన్నాయన్న విషయం చంద్రబాబునాయుడుకు అర్ధమైపోయింది. మామూలుగా అయితే, మున్సిపల్ ఎన్నికలు పోయిన నవంబర్ లోనే జరపాలి. అయితే, ఓటర్ జాబితాల సవరణ అని, వార్డుల రిజర్వేషన్ అని ఏదో కారణాలు చెబుతూ ఇంత కాలం వాయిదా వేస్తోంది ప్రభుత్వం. ఈ నేపధ్యంలోనే ఎంఎల్సీ ఎన్నికలు జరిగాయి.
దానికితోడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డేమో నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఏదో ఓ సమస్యతో ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజల్లో తిరగటం కన్నా ప్రతిపక్ష నేత చేయగలిగింది కూడా లేదుకదా? అసెంబ్లీలోనూ, బయటా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అంటే ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అదే విషయం మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో ఫలితాలో కనబడింది కూడా. దాంతో ప్రభుత్వం ఆందోళనలో పడిపోయింది.
అప్పటికే జనాల్లో వ్యతరేకత మొదలైందన్న అనుమానాలతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుండా ఏవో కారణాలు చెబుతూ నెట్టుకొస్తోంది. ఇక, ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలతో ప్రజా వ్యతిరేకత అన్నది నిర్ధారణ కూడా అయింది. దాంతో ఇంకేం మున్సిపల్ ఎన్నికలు అనుకుంటున్నారు జనాలు. మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళి స్పష్టమైన ఆదేశాలు తీసుకువస్తే తప్ప ఎన్నికల నిర్వహణ గురించి ప్రభుత్వం ఆలోచించనుగాక ఆలోచించదు. ఎవరికైనా అనుమానాలా?
