Asianet News TeluguAsianet News Telugu

చక్రపాణి బాటలోనే మరింతమంది సీనియర్లు ?

  • చక్రపాణి దారిలోనే నడవటానికి టిడిపిలోని మరింతమంది సీనియర్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
  • ప్రకాశం జిల్లా, కడప జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని పలువురు సీనియర్లు నాయకత్వంపై తీవ్రస్ధాయిలో అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం.
  • అయితే, వివిధ కారణాల వల్ల  బయటపడటం లేదు.
  • ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, కడప జిల్లాలో రామసుబ్బారెడ్డి లాంటి నేతలు వివిధ జిల్లాల్లో చాలామందే ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే.
Will Chakrapani revolt trigger more defections from tdp

నంద్యాల నేత శిల్పాచక్రపాణి రెడ్డి బాటలోనే మరింత మంది టిడిపి సీనియర్లు నడుస్తారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. టిడిపిలో సీనియర్ నేతైన శిల్పా చక్రపాణిరెడ్డి బుధవారమే పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే, టిడిపికి రాజీనామా చేసిన చక్రపాణి ఎంఎల్సీకి మాత్రం రాజీనామా చేయలేదు. కర్నూలు జిల్లాలోని ఫిరాయింపులు రాజీనామాలు చేస్తే తాను కూడా ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు బహిరంగంగానే సవాలు విసిరారు. అయితే, టిడిపి నుండి సమాధానం లేదనుకోండి అది వేరే సంగతి.

అయితే, ఇపుడు విషయమేమిటంటే, చక్రపాణి దారిలోనే నడవటానికి టిడిపిలోని మరింతమంది సీనియర్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా, కడప జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని పలువురు సీనియర్లు నాయకత్వంపై తీవ్రస్ధాయిలో అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. అయితే, వివిధ కారణాల వల్ల  బయటపడటం లేదు. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, కడప జిల్లాలో రామసుబ్బారెడ్డి లాంటి నేతలు వివిధ జిల్లాల్లో చాలామందే ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే.

ఫిరాయింపుల మీద ఆగ్రహంతో, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళనతో సుమారు  60 మంది ఎంఎల్ఏలు, నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారంతా చంద్రబాబునాయుడు వైఖరితో మండిపోతున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఏం చేయలేక మౌనంగా ఉన్నారు. వారందరూ బహుశా నంద్యాల ఉపఎన్నిక ఫలితం కోసమే ఎదురు చూస్తున్నట్లు కనబడుతోంది. నంద్యాల ఉపఎన్నికలో టిడిపి ఓడిపోతే, అసంతృప్తులందరికీ గొంతు విప్పటానికి ధైర్యం వస్తుంది. అప్పుడు మెల్లిగా బయటకువస్తారు.

ఇపుడు జరుగుతున్న నంద్యాల ఉపఎన్నిక కూడా ఫిరాయింపు నియోజకవర్గమే అన్నమాట మరచిపోకూడదు. ఇక్కడ టిడిపి ఓడిపోతే మిగిలిన ఫిరాయింపులకు కూడా ఇబ్బందులు మొదలవుతాయి. దానికితోడు నియోజకవర్గాల పెంపు కూడా లేదన్న విషయం తేలిపోయింది. దానివల్ల వచ్చే సమస్యలేంటో సిఎంకు బాగా తెలుసు. కాబట్టే నంద్యాల గెలుపును చంద్రబాబు అత్యంత ప్రతిష్టగా తీసుకుని పోరాడుతున్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios