వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న భాజపా నేతలు అసెంబ్లీ సీట్ల పెంపును వ్యతిరేకిస్తున్నారు. సీట్ల పెంపు వల్ల టిడిపికి లాభం తప్ప భాజపాకు ఏమీ ఒరగదని జాతీయ నాయకత్వానికి నివేదిక అందచేసారు. దాంతో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని కేంద్రం పరిశీలించటం లేదని అనేకమార్లు కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. రానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై బిల్లు పెట్టకపోతే చంద్రబాబుకు ముందు ముందు కష్టాలే.
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అన్నది భేతాళుడి ప్రశ్నలాగ తయారైంది. పార్లమెంటు సభ్యులతో చంద్రబాబునాయుడు సోమవారం నిర్వహించిన సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరుగుతుందని చెప్పటం గమనార్హం. నియోజవకవర్గాలను పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు తనకు సమాచారం ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిందగ్గర నుండి చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. కేంద్రం సాధ్యం కాదంటూ తేల్చి చెబుతూనే ఉంది. ఇంతకీ నియోజకవర్గాలను పెంచాలంటూ చంద్రబాబు ఎందుకు పట్టుబడుతున్నారు?
ఫిరాయింపు ఎంఎల్ఏలకు-పార్టీలోని సీనియర్లకు మధ్య వివాదాలు పెరగకూడదంటే నియోజకవర్గాలు పెరాగాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఆయా నియోజకవర్గాల్లో కష్టాలే. వైసీపీకి చెందిన 21 మంది ఎంఎల్ఏలను చంద్రబాబు ఫిరాయింపుల ద్వారా టిడిపిలోకి లాక్కున్నారు. దాంతో అప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జిలుగా ఉన్నటిడిపి సీనియర్ నేతల్లో అభద్రత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తామే పోటీ చేస్తామనుకుని అప్పటికే భారీగా డబ్బు ఖర్చు చేసుకున్నారు. అటువంటిది ఒక్కసారిగా వైసీపీ ఎంఎల్ఏలను లాక్కోవటంతో సీనియర్ నేతలు ఖంగుతిన్నారు. అప్పటి నుండి పార్టీలోని సీనియర్లతో ఫిరాయింపు ఎంఎల్ఏలకు సమస్యలు మొదలయ్యాయి.
ఆయా జిల్లాల సమీక్షలు జరిగినపుడు సీనియర్లతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో నియోజకకవర్గాలు పెరుగుతున్నాయని, కాబట్టి అందరికీ టిక్కెట్లు సర్దుబాటు చేస్తానంటూ చంద్రబాబు బుజ్జగిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే చంద్రబాబు నియోజకవర్గాల పెంపు విషయమై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, సందట్లో సడేమియా అన్నట్లు రాష్ట్రంలోని భాజపా నేతలు అడ్డుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న భాజపా నేతలు అసెంబ్లీ సీట్ల పెంపును వ్యతిరేకిస్తున్నారు. సీట్ల పెంపు వల్ల టిడిపికి లాభం తప్ప భాజపాకు ఏమీ ఒరగదని జాతీయ నాయకత్వానికి నివేదిక అందచేసారు. దాంతో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని కేంద్రం పరిశీలించటం లేదని అనేకమార్లు కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. రానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై బిల్లు పెట్టకపోతే చంద్రబాబుకు ముందు ముందు కష్టాలే. అందుకనే సమావేశాల్లో బిల్లు పెట్టేట్లు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపిలను ఆదేశిస్తున్నారు. నిజంగానే కేంద్రం సీట్ల పెంపుపై సుముఖంగా ఉంటే ఇక ఒత్తిడి ఎందుకు?
