కేంద్రం నుండి పోలవరం, అమరావతి నిర్మాణాలకు ఆర్ధిక సాయం అందే ఛాన్సే లేదు.
రాజధాని అమరావతి నిర్మాణం ఇక భ్రమేనా? పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నెలకొన్న పరిస్ధితులను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. నోట్ల రద్దు తర్వాత దేశంలో పరిస్ధితులు అలా మారిపోయాయి మరి. అమరావతి నిర్మాణాన్ని ఆరంభించి వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందుదామన్న చంద్రబాబు కల ఈ పరిస్ధితుల్లో నెరవేరేది అనుమానమే.
ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో నూతన రాజధాని నిర్మాణం తన వల్లే సాధ్యమవుతుందని చంద్రబాబు ఊరు వాడా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు పూర్తయినా పలుమార్లు శంకుస్ధాపన జరగటం మినహా రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుకు కూడా లేవలేదు.
నవంబర్ 8వ తేదీన ప్రధాని నోట్ల రద్దు ప్రకటన తర్వాత దేశ ఆర్ధిక పరిస్ధితే తల్లక్రిందులైంది. చెలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని ఒక్కసారిగా రద్దు చేయటంతో దేశంలోని అన్నీ రంగాలు కుదేలయ్యాయి. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి.
నెలవారీగా రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాలూ బాగా తగ్గిపోయాయి. ఈ పరిస్ధితుల్లో మిగితా రాష్ట్రాలతో పోలిస్తే ఏపి పరిస్ధితి మరీ దయనీయంగా తయారైంది. ఆదాయార్జన శాఖలైన ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీ, భూగర్భ గనులు, రెవిన్యూ శాఖల నెలవారీ ఆదాయాలు సగానికి పైగా పడిపోయాయి. దాని ప్రభావం సహజంగానే రాష్ట్ర ఖజానాపైన పడింది.
రాష్ట్రాల ఆదాయాలు పడిపోతే కేంద్రానికి రావాల్సిన ఆదాయాలు మాత్రం ఎక్కడి నుండి వస్తాయి? రాష్ట్రాలు వసూళ్ళు చేసే పన్నుల్లో నుండే కేంద్రానికి వాటా వెళుతుంది. రాష్ట్రాలకే వసూళ్లు లేకపోవటంతో కేంద్రం గురించి చెప్పేదేముంది. దాంతో రాష్ట్రాలకు అందించాల్సిన ఆర్ధిక సాయాన్ని కేంద్రం కుదించేసింది.
నోట్ల రద్దుకు ముందే కేంద్రం నుండి రాష్ట్రానికి అందిన ఆర్ధిక మద్దతు అంతంత మత్రమే. ఇపుడు అది మరింత తగ్గిపోయింది. రూ. 16500 కోట్ల రెవిన్యూలోటుతో మొదలైన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆదాయల విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉంది. పోలవరం లాంటి అనేక పథకాలకు కేంద్రం అందివ్వాల్సిన ఆర్ధికసాయాన్ని కూడా కేంద్రం ఇవ్వలేదు.
‘మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు’ నోట్ల రద్దు ఉపద్రవం వచ్చి పడింది. దాంతో సిఎంకు ఏమి చేయాలో దిక్కు తోచటం లేదు. రాష్ట్రంలో వచ్చే ఆదాయాలు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపు, సంక్షేమ పథకాల అమలుకే సరిపోవటం లేదు. ఇక ప్రాజెక్టుల సంగతి దేవుడికే తెలియాలి.
సమీప భవిష్యత్తులో భారీ ప్రాజెక్టులు చేపట్టినా పూర్తి కావటం అన్నది కలే. ఇటువంటి పరిస్ధితుల్లో కేంద్రం నుండి పోలవరం, అమరావతి నిర్మాణాలకు ఆర్ధిక సాయం అందే ఛాన్సే లేదు. కాబట్టి రాజధాని అమరావతి నిర్మాణం అన్నది దాదాపు భ్రమే అన్నది అందరూ అనుకుంటున్న మాట. అందరూ అనుకుంటున్న విషయాన్ని మేధావి చంద్రబాబు ఆలోచించకుండా ఉంటారా?
