ఏలూరు: ఓ మహిళ తన తల్లితో కలిసి భర్తను హత్య చేసింది. చీరతో ఉరేసి ఆమె భర్తను హత్య చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్డునుడుపాలెం గ్రామంలో గురువారం జరిగింది. 

మద్యానికి బానిసగా మారి నిత్యం వేధిస్తుండడంతో ఈ హత్యకు పాల్పడింది. వ్యవసాయం పనులు చేసుకునే వడ్డి కొండయ్య (35)కు అదే గ్రామానికి చెందిన చెన్నవరపు పార్వతి కూతురు రామలక్ష్మితో 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. వారికి 12, 11 ఏళ్ల వయస్సులు గల కూతురళ్లు ఉన్నారు. కొండయ్య మద్యం తాగి వచ్చి భార్యతో నిత్యం గొడవ పడుతుండేవాడు. 

దాతో రామలక్ష్మి పిల్లలతో కలిసి అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. బుధవారం రాత్రి కొండయ్య అత్తగారి ఇంటికి వెళ్లాడు. భార్యతో గొడవకు దిగాడు. దాంతో విసుగు చెందిన భార్య రామలక్ష్మి, అత్త పార్వతి కలిసి కొండయ్య మెడకు చీర చుట్టి లాగారు. దాంతో ఊపిరి ఆడక కొండయ్య మరణించాడు. 

కొండయ్య అన్న వడ్డి వెంకటేశ్వర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెనుగొండ సీఐ సునీల్ కుమార్, ఇరగవరం ఎస్సై జానా సతీష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు నిందితులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని తణుకు ఆస్పత్రికి తరలించారు.