ప్రియుడి మోజులో భర్తను హత్య చేసింది ఓ భార్య.  మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు వెలుగు చూశాయి. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  

అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం సీఐ సురేష్ బాబు ఈ ఘటనకు సంబంధించి మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారంనాడు వెల్లడించారు.

ఈ నెల 20వ తేదీన కళ్యాణ దుర్గం మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాసులు తన ఇంటి ఆవరణలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని వయస్సు 37 ఏళ్లు. అయితే తన కొడుకు మరణానికి కోడలు సరిత, ఆమె ప్రియుడు ప్రభాకర్ కారణమని పోలీసులకు శ్రీనివాసులు తండ్రి రామచంద్రప్ప ఫిర్యాదు చేశాడు.

సరిత, ప్రభాకర్ మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం శ్రీనివాసులుకు తెలిసింది. దీంతో భార్యను ఆయన మందలించాడు. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలోనే ఈ నెల 20వ తేదీన కూడ వారిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. మాటా మాట పెరిగింది. కోపంలో సరిత తన భర్త శ్రీనివాసులుపై కర్రతో బలంగా కొట్టింది. 

దీంతో శ్రీనివాసులుకు తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు ప్రభాకర్ కు చెప్పింది. దీంతో శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకొన్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది.

ప్రభాకర్ , సరితలు కలిసి శ్రీనివాసులు మృతదేహానికి ఇంటి ఆవరణలోనే చెట్టుకు ఉరేశారు. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడని నమ్మించేందుకు ఉరేసినట్టుగా పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకొన్నారు. 

నిందితులను గురువారం నాడు అరెస్ట్ చేసినట్టుగా సీఐ తెలిపారు.