ఒంగోలు: వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే కారణంగా ప్రియుడితో కలిసి భర్తను కలిసి భార్య హతమార్చింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

ప్రకాశం జిల్లా మార్కాపురం పూల సుబ్బయ్య కాలనీలో నివాసం ఉండే ఎల్లంగారి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ కు ఆరేళ్ల క్రితం ఆశ్వనితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆశ్వనికి దేవరాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.  ఈ విషయం వెంకటేష్ కు తెలిసింది. దీంతో భార్యను మందలించాడు.

భార్యాభర్తల మధ్య ఈ విషయమై గొడవలు చోటు చేసుకొన్నాయి. పద్దతిని మార్చుకోవాలని కూడ భర్త వెంకటేష్ హెచ్చరించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. నెల రోజుల క్రితం ఆశ్వని, దేవరాజ్ లు ఇంటి నుండి పారిపోయారు.

ఈ విషయమై వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ లోపుగా ఆశ్వని, దేవరాజులు తిరిగి వచ్చారు. ఈ నెల 28వ తేదీన ఆశ్వని వెంకటేష్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.  ఈ గొడవ మరింత పెద్దదైంది. వీరిద్దరూ కలిసి దేవరాజ్ ఇంటికి వెళ్లారు. అక్కడ కూడ గొడవపడ్డారు. ఆశ్వని,దేవరాజులు వెంకటేష్ పై దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. 

ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  నిందితులను త్వరలోనే పట్టుకొంటామని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.