అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న మొగుడిని భార్యే హతమార్చిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. భర్తకు మరో మహిళతో వలపు వల విసిరేలా చేసి చివరికి హతమార్చింది

నంద్యాలలో సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న మొగుడిని భార్యే హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. పగిడ్యాల మండలం పాతకోట గ్రామానికి చెందిన రాము అలియాస్‌ వెంకటన్నకు భార్య శ్యామల, కొడుకు శరత్ బాబు వున్నారు. వెంకటన్న మెడికల్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. శ్యామల ఇంటి దగ్గర చీరల వ్యాపారం చేస్తూ భర్తకు ఆర్ధికంగా అండగా నిలుస్తోంది. 

ఇలాంటి దశలో జూన్ 19న వెంకటన్న దారుణహత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా శ్యామలే హంతకురాలుగా తేలడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు షాకయ్యారు. బేతంచెర్లకు చెందిన కుమారస్వామికి శ్యామలతో వివాహేతర సంబంధం వుంది. ఇది తెలుసుకున్న వెంకటన్న భార్యను వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే తమ బంధానికి అడ్డుగా వున్న భర్తను హతమార్చాలని శ్యామల ప్రియుడు కుమారస్వామితో కలిసి కుట్ర పన్నింది. ప్లాన్‌లో భాగంగా బేతంచెర్లకు చెందిన దేవమణి అనే మహిళతో వెంకటన్నకు వలపు వల విసిరేలా చేశారు. 

Also Read: రేయింబవళ్లు కష్టపడి భార్యని చదివిస్తే.. గవర్నమెంట్ జాబ్‌ వచ్చాక మరొకరితో..

వీరిద్దరి మధ్య బంధం గట్టిగా మారిందని నమ్మకం కుదిరాక.. జూన్ 19న వెంకటన్నకు దేశమణి ఫోన్ చేసి జూపాడుబంగ్లా మండలం భాస్కరాపురం గ్రామం సమీపంలోని కేసీ కెనాల్‌ గట్టు వద్దకు రావాలని చెప్పింది. ప్రియురాలు పిలవడంతో వెంకటన్న అక్కడికి తన ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. అప్పటికే మాటు వేసి వున్న కుమారస్వామి, అతని నలుగురు స్నేహితులు వెంకటన్న గొంతుకు తీగ బిగించి చంపేశారు.

తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు గాను వెంకటన్న ముఖాన్ని బండరాళ్లతో చిధ్రం చేశారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా శ్యామల ప్రవర్తన అనుమానాస్పదంగా వుండటంతో పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించగా హత్య విషయం వెలుగుచూసింది. దీంతో వెంకటన్న చంపిన కుమారస్వామి, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.