విజయవాడ: భార్య ప్రవర్తన బాగాలేకపోవడంతో ఆమెను విడిచిపెట్టాలని ప్రయత్నిస్తున్న భర్తతో రాజీ కుదుర్చాలని అధికార వైసిపి పార్టీకి చెందిన ఓ నాయకురాలు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నం ఫలించకపోగా మనస్థాపంతో బాధిత యువకుడు ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యింది. ఈ దారుణం కృష్ణా  జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... జిల్లాలోని వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన షేక్ సయ్యద్ బాబు భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రియుడితో కలిసి ఆమె పరారయ్యింది. ఈ విషయం తెలిసిన సయ్యద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో అతడి భార్యతో పాటు ఆమె ప్రియుడు ఎక్కడున్నారో గుర్తించిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు రప్పించారు. 

బాబు భార్య స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం పెద్దమనుషుల పంచాయతీ కోసం కేసు నమోదు చేయకుండా వారిని పంపించారు. తిరిగి భర్త వద్దకు వెళ్లడానికి  భార్య ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేందుకు వైసిపి నాయకురాలు మాజీ జెడ్పిటిసి షహనాజ్ బేగం ప్రయత్నించారు. అయితే తాను పలుమార్లు చెప్పినా వినలేదని... అలాంటి భార్య తనకు వద్దని బాబు భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో రాజీకి రాకపోతే వేధింపుల చట్టం కింద కేసు పెట్టించాల్సి  ఉంటుందని సదరు వైసిపి నాయకురాలు బెదిరించారు. 

దీంతో భయపడిపోయిన బాబు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. మనస్థాపంతో పురుగు మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అతడిని నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.