విజయవాడ: కట్టుకున్న భార్య బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని ఎ.సీతారాంపురం గ్రామంలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... సీతారాంపురంకు చెందిన జయబాబు ఓ వివాహిత బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను స్నేహితులతో పంచుకున్నాడు. ఇలా ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతూ చివరకు బాధితురాలి వద్దకు చేరింది. 

దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తాను స్నానం చేస్తుండగా జయబాబు వీడియో తీసి వైరల్ చేశాడంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే బాధితురాలి భర్త మనస్థాపంతో దారుణానికి పాల్పడ్డాడు. భార్య నగ్న వీడియో వైరల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

తన పరువు పోవడానికి... భర్త ఆత్మహత్యకు జయబాబే కారణమని బాధితురాలు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి ఆకతాయి పనుల కారణంగా ఇప్పుడు తమ కుటుంబం దిక్కులేనది అయిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.