ప్రేమించుకున్నారు.. పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్నారు.. తమ ప్రేమకు చిహ్నంగా ఓ చిన్నారికి జన్మనిచ్చారు.. కానీ విధి వారిపై చిన్న చూపు చూసింది.. చిన్నారికి తండ్రిలేకుండా చేసింది.. ఆ భార్యకు ప్రేమించిన భర్తను దూరం చేసింది.. ఈ విషాదాన్ని తట్టుకోలేక..భర్తలేని జీవితం వద్దంటూ ఆమె రోధన అందర్నీ కలిచివేసింది. 

భర్తను కడదాకా సాగనంపడం కోసం ఆరురోజుల పసికందుతో ఆంత్యక్రియలకు హాజరయ్యింది. ఈ విషాధ ఘటన చిత్తూరు జిల్లా కలకడలో ఆదివారం జరిగింది. ప్రమాదంలో గాయపడిన భర్త ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటాడని ఎదురు చూసిన భార్యకు విగతజీవుడై రావడంతో చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. 

కలకడ ఇందిరమ్మ కాలనీకి చెందిన పి.గంగాధర (25) శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. శనివారం తిరుపతిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని పచ్చి బాలింత అయిన కోడలికి చెబితే తట్టుకోలేదని ఆ తల్లిదండ్రులు దు:ఖాన్ని కడుపులోనే దాచుకున్నారు. 

ఈ విషయం కోడలు మంగమ్మతో చెప్పకుండా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడని నమ్మబలికారు. ఆదివారం భర్త మృతదేహం ఇంటికి చేరడంతో మంగమ్మ చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. భర్త లేని జీవితం తనకు వద్దంటూ ఆమె విలపించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. 

ఆరు రోజుల పసికందుతో భర్త అంత్యక్రియల్లో పాల్గొంది. మూడు కిలోమీటర్లు నడచి సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని చెల్లెలు భవాని  శ్మశానం వరకు నలుగురిలో ఒకరుగా మోసింది. ఈ దృశ్యాలు కలకడవాసుల కలచివేశాయి.