ప్రియుడి కోసం: భర్త గొంతు కోసి నవవధువు పరార్

First Published 29, May 2018, 8:59 AM IST
Wife attempts kill husband in Srikakulam district
Highlights

భర్తపై ఓ భార్య హత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. 

శ్రీకాకుళం: భర్తపై ఓ భార్య హత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పార్వతీపురం సమీపంలో భర్తను హత్య చేయించిన భార్య ఉదంతాన్ని మరిచిపోక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహమైన 20 రోజులకే భర్తను తానే స్వయంగా చంపడానికి భార్య వ్యూహరచన చేసి అమలు చేసింది. అయితే, అది కాస్తా బెడిసి కొట్టింది.

భర్త వెనక బైకుపై కూర్చుని కత్తితో అతని గొంతు కోసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటబొమ్మాళి రైలునిలయం సమీపంలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
 
సంతబొమ్మాళి మండలంమాలనర్సాపురం గ్రామానికి చెందిన బుడ్డ సింహాచలం(నవీన్‌కుమార్‌) (23)తో అదే మండలం బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామానికి చెందిన నీలిమ (19)కు ఈ నెల 9వ  తేదీన పెళ్లయింది. వారిద్దరు సోమవారం సాయంత్రం నీలిమ స్వగ్రామం గొదలాం నుంచి బైక్ పై బయలుదేరారు.

బైక్ వెనక కూర్చున్న నీలిమ కోటబొమ్మాళి రైలు నిలయం సమీపంలో భర్తపై అకస్మాత్తుగా దాడిచేసి చాకుతో గొంతు కోసే ప్రయత్నం చేసింది. దాడిలో మెడ భాగం తెగి తీవ్రంగా గాయపడిన నవీన్‌కుమార్‌ బైక్ పై నుంచి పడిపోయాడు. నీలిమ అక్కడి నుంచి పరారైంది.

తీవ్రంగా గాయపడిన నవీన్‌కుమార్‌ను స్థానికులు ముందుగా కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించినతర్వాత  శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కాలిపై కూడా గాయాలున్నాయి.

సబ్బి నీలిమ తండ్రి కొంత కాలం కిందట మరణించాడు. సోదరుడు డిగ్రీ చదువుతున్నాడు. పేదరికం వల్ల స్థానికులు ఆమె పెళ్లికి తలా కొంత సాయం చేశారు. ఆమెకు బలవంతంగా ఆ వివాహం చేసినట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే దాడికి కారణంగానే భర్తపై ఆమె దాడి చేసిందనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సంతబొమ్మాళి ఎస్‌.ఐ.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిందితురాలు నీలిమను సంతబొమ్మాళి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టి ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమెను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

loader