విజయసాయి వైసీపీ అధినేత జగన్ కు నమ్మినబంటన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానిని కలిసి తాను మాట్లాడదలుచుకున్న విషయాలను జగన్ రాజ్యసభసభ్యుని ద్వారా చెప్పించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటీ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఊపిరి తీసుకునేందుకు కూడా తీరికలేని సమయంలో కూడా మోడి విజయసాయితో 15 నిముషాల పాటు సమయం కేటాయించటం చిన్న విషయం కాదు. అందుకే వీరి భేటిపై పలువురు ఆశ్చర్యపోతున్నారు. అంటే ఏ స్ధాయిలో మోడి విజయసారధిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోతే 15 నిముషాలు కేటాయిస్తారన్నది గమనించాలి.

మొన్ననే ఎన్డీఏలోని పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసారు. ఏకాంతంగా మోడిని కలవాలని చంద్రబాబు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అంతుకుముందు ఢిల్లీ పర్యటనలో జగన్ కూడా మోడి కలుద్దామనుకున్నారు. కానీ కుదరలేదు. వీరిద్దరికి తనతో విడిగా మాట్లాడటానికి సమయం కేటాయించని మోడి విజయసాయికి మాత్రం ఏకంగా పావుగంట ఎందుకు కేటాయించి ఉంటారు అనే విషయమై తీవ్ర చర్చే జరుగుతోంది.

విజయసాయి వైసీపీ అధినేత జగన్ కు నమ్మినబంటన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానిని కలిసి తాను మాట్లాడదలుచుకున్న విషయాలను జగన్ రాజ్యసభసభ్యుని ద్వారా చెప్పించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, జగన్ తన ఢిల్లీ పర్యటనలో ఫిరాయింపు ఎంఎల్ఏలపైన, చంద్రబాబు అనైతిక రాజకీయాలపైనే పలువురిని కలిసి ఫిర్యాదులు చేసారు. రాష్ట్రపతి మొదలు, కేంద్రమంత్రులు, పలువురు జాతీయ స్ధాయి నేతలను జగన్ కలిసారు. అదే విధంగా ప్రధానిని కూడా కలుద్దామని అనుకున్నారు. అయితే సాధ్యం కాలేదు. అటువంటిది విజయసాయి మోడిని కలవటంలో జగన్ వాదన వినిపించటమే ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

ఒకవైపు విజయసాయి ప్రధానిని కలిసిన మరుసటి రోజే భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు మదనపల్లిలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించటం గమనార్హం. ఇంకోవైపేమో వచ్చే ఎన్నికల్లో వైసీపీ-భాజపాలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి ఈ ప్రచారాల్లో ఏది నిజమో స్పష్టంగా తెలీలేదు. మొత్తానికి విజయసాయి మాత్రం చంద్రబాబుపై ఫిర్యాదు చేసే ఉంటారనటంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు.