చంద్రబాబు విధానాలతో ఇప్పటికే ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నది వాస్తవం. మొన్న జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో ఆ విషయం స్పష్టంగా బయటపడింది. ఇటువంటి సమయంలోనే ఉద్యోగులతో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అటువంటిది వారితో వైరం పెంచుకోవటం, రెచ్చ గొట్టేవిధంగా మాట్లాడటం వల్ల వైసీపీకే నష్టం.
ఉద్యోగ వర్గాలను వైసీపీ చేతులారా దూరం చేసుకుంటోంది. ఎవరో కొందరు ఉద్యోగులు టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అక్కసుతో వైసీపీ ఎంఎల్ఏలు చేస్తున్న వ్యాఖ్యలతో మొత్తం ఉద్యోగులందరికీ పార్టీ దూరమయ్యే ప్రమాదముంది. చంద్రగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదమయ్యాయి. టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం మారగానే వెంటాడి కక్ష తీర్చుకుంటామన్నట్లుగా చెప్పారు.
రెండు రోజుల క్రితం చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. సరే ఉద్యోగసంఘాల నేతలు కూడా చెవిరెడ్డి మాటలకు ధీటుగానే స్పందించారనుకోండి అది వేరే సంగతి. తన వ్యాఖ్యలకు చెవిరెడ్డి క్షమాపణ చెప్పాలంటూ నేతలు డిమాండ్ చేసారు. అయితే, తన మాటలకు కట్టుబడి ఉన్నానంటూ చెవిరెడ్డి ఇచ్చిన బదులు వివాదానికి మరింత ఆజ్యాన్ని పోసింది.
ఇక్కడ వైసీపీ నేతలు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఉద్యోగుల్లో అత్యధికులు న్యూట్రల్ గానే ఉంటారు. అధికారపార్టీకి అనుకూలంగా పనిచేసే ఉద్యోగులసంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వారిని హెచ్చరించాలంటే అందుకు మార్గాలు వేరే ఉన్నాయి. వెంటాడుతాం, కక్ష సాధిస్తాం లాంటి స్టేట్ మెంట్లు పనికిరావు. అందులోనూ బహిరంగ సభలు, పార్టీ సమావేశాల్లో మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
చంద్రబాబు విధానాలతో ఇప్పటికే ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నది వాస్తవం. మొన్న జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో ఆ విషయం స్పష్టంగా బయటపడింది. ఇటువంటి సమయంలోనే ఉద్యోగులతో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అటువంటిది వారితో వైరం పెంచుకోవటం, రెచ్చ గొట్టేవిధంగా మాట్లాడటం వల్ల వైసీపీకే నష్టం. ఉద్యోగులతో వైరం పెట్టుకుంటే ఎవరైనా నష్టపోవాల్సిందే అన్న విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది.
