రాష్ట్రంలోని జనాలు ఇపుడు ఈ ఇద్దరు ఎంపిల గురించే మాట్లాడుకుంటున్నారు. బడ్జెట సమర్పణ నేపధ్యంలో రాష్ట్రంలోను, పార్లమెంటులోనూ జనాలు, ఎంపిలు చేస్తున్న ఆందోళనలు అందరూ చూస్తున్నదే. ఒకవైపు టిడిపి ఎంపిలు, మరోవైపు వైసిపి ఎంపిలు పోటాపోటీగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళనలు చేస్తున్నారు. రెండు పార్టీలకు చెందిన ఎంపిలు ఏదో ఓ రూపంలో నిరసనలు చేస్తూ, ఆందోళనలు చేస్తూ మీడియాలో కనిపిస్తున్నారు.

అయితే, రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపిలు మాత్రం ఎక్కడా అడ్రస్ లేకుండా పోయారు. ఇంతకీ వారెవరంటే వైసిపి ఫిరాయింపు ఎంపిలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీత. వీరిద్దరు అటు టిడిపి ఎంపిలతోనూ కనబడక, ఇటు వైసిపి ఎంపిల నిరసనల్లోనూ పాల్గొనక పోవటమే ఆశ్చర్యంగా ఉంది.

వైసిపి తరపున పోటీ చేసిన అరకు ఎంపి కొత్తపల్లి గీత గెలిచిన కొద్ది రోజులకే టిడిపి పంచన చేరారు. అప్పటి నుండి టిడిపి ఎంపిలతోనే తిరుగుతున్నారు. అయితే ఈమధ్య వారితో కూడా చెడినట్లుంది. అందుకనే వారితో కూడా పెద్దగా కలవటం లేదు. ఇక, కర్నూలు లోక్ సభకు పోటీ చేసిన బుట్టా రేణుక ఈ మధ్యనే టిడిపిలోకి ఫిరాయించారు (?).

అసలు తానే పార్టీలో ఉన్నారో బహశా బుట్టాకే తెలీదేమో? ఎందుకంటే, తాను టిడిపిలో చేరలేదని ఒకసారి ఆమె స్వయంగా ప్రకటించారు. మళ్ళీ చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఎంపిల సమీక్షల్లో కనిపిస్తున్నారు. అందుకే బుట్టా పూర్తిగా అయోమయంలో ఉన్నారేమో అనిపిస్తోంది. కాకపోతే పార్టీ ఫిరాయించినందుకు లోక్ సభ స్పీకర్ తమపై ఎక్కడ చర్యలు తీసుకుంటారొ అన్న భయం మాత్రం వారిద్దరినీ వెంటాడుతోంది. అందుకనే టిడిపితో కలవలేక వైసిపి దగ్గరకు వెళ్ళలేక మొత్తానికి రాష్ట్ర సమస్యలను పట్టించుకోవటం మానేసారు.