చంద్రబాబునాయుడు సామర్ధ్యంపై పార్టీ నేతల్లో నమ్మకం సడలిపోతోందా? పార్టీ నేతల మధ్య అంతర్గతంగా తలెత్తుతున్న వివాదాలను చంద్రబాబు పరిష్కరించలేకపోతున్నారా? తెలంగాణా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు గురువారం ఉదయం చేసిన వ్యాఖ్యలను చూస్తే అందరిలోనూ అవే అనుమానాలు కలుగుతున్నాయి. అనుమానాల సంగతి పక్కన పెడితే మోత్కుల్లి వ్యాఖ్యలు మాత్రం కలకలం రేపాయి. సీనియర్ నేత లేవనెత్తిన అంశాలపై టిడిపిలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

సరిగ్గా ఎన్టీఆర్ 22వ వర్దింతి సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ, చంద్రబాబు సామర్ధ్యాన్నే శంకించారు. తెలంగాణాలో టిడిపిని చంద్రబాబు గాలికొదిలేసారన్నట్లు చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. చంద్రబాబు టిడిపి జాతీయ అధ్యక్షుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఏపిలో సిఎంగా ఉన్నంత మాత్రాన తెలంగాణాలో టిడిపిని గాలికొదిలేస్తారా? అన్నది మోత్కుపల్లి లాజిక్. తెలంగాణాలో పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు ఎలాగూ సమయం ఇవ్వలేరని మోత్కుపల్లి తీర్మానించేశారు. కాబట్టి అంతరించిపోతున్న టిడిపిని బతికించుకునేందుకు టిఆర్ఎస్ లో కలిస్తే తప్పేంటని మోత్కుపల్లి సూటిగానే ప్రశ్నించారు.

గడచిన మూడున్నరేళ్ళల్లో పార్టీని పటిష్టం చేయటం కోసం చంద్రబాబు తెలంగాణాలో తిరిగింది పెద్దగా లేదనే చెప్పాలి. ఎప్పుడైనా ఇంటికి వచ్చినపుడో లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చినపుడో నేతలను కలవటమే. తెలంగాణా నేతలతో సమావేశమవ్వాలంటే ఇపుడు కూడా చంద్రబాబు వారందిరినీ విజయవాడకే పిలిపిచ్చుకుంటున్నారు. దాంతో నాయకత్వంలోనే కాకుండా కార్యకర్తల్లో కూడా ఆత్మ స్ధైర్యం దెబ్బతిన్నది మాత్రం వాస్తవం. అందుకనే ఒకరొకరుగా నేతలు టిడిపిని వదిలేసి టిఆర్ఎస్ లోకో లేకపోతే కాంగ్రెస్ లోకో వెళ్ళిపోతున్నారు.

తెలంగాణాలో టిడిపి బతకదన్న అనుమానంతోనే నేతలందరూ వెళ్ళిపోతున్నారు. అదే విషయాన్ని మోత్కుపల్లి ఈరోజు బాహాటంగానే చెప్పారు. తెలంగాణాలో ఉన్న పరిస్ధితే దాదాపు ఏపిలో కూడా ఉంది. పార్టీ నేతల మధ్య గొడవలు లేని జిల్లా ఒక్కటీ లేదు. ఎన్నోసార్లు చంద్రబాబు సర్దుబాటు చేస్తున్నా ఏ ఒక్క నేతా చంద్రబాబు మాట వినటం లేదు. కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం ఇలా అన్నీ జిల్లాల్లోనూ ఒకే పరిస్దితి. తెలంగాణా కన్నా ఏపి పరిస్దితి కొంతనయం ఎందుకంటే, ఏపిలో టిడిపి అధికారంలో ఉంది కాబట్టి నేతలెవరూ ప్రస్తుతానికి టిడిపిని వదిలేసి బయటకు వెళ్ళటం లేదు.

 

                                                                                                                                                                                                             మోత్కుపల్లిలో ఎందుకంత అసంతృప్తి?

మోత్కుపల్లి తాజాగా లేవనెత్తిన అంశాల్లో తప్పేమీ లేదు. కాకపోతే బహిరంగంగానే ఎందుకు చంద్రబాబును ప్రశ్నించాడు అన్నది ప్రశ్న. పరిస్దితి చూడబోతే సీనియర్ నేతలో అసంతృప్తి బాగా కనబడుతోంది. ఎందుకంటే, జిల్లా ముక్కలైపోయింది. నల్గొండలోని ఆలేరు నియోజకవర్గం  సిద్దిపేట జిల్లాలో కలిసిపోయింది. అంటే జిల్లాతో పాటు నియోజకవర్గాన్ని కూడా మోత్కుపల్లి కోల్పోయారు. పైగా పదమూడున్నరేళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉన్నారు. నోరున్న ఎస్సీ నేత కాబట్టి భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు కనబడుతోంది. భవిష్యత్తులో టిడిపి అధికారంలోకి వచ్చే సూచనలు లేవు కాబట్టి టిఆర్ఎస్ తో విలీనం గురించి పట్టుబడుతున్నారు. అదేమో ఆలస్యమవుతోంది. అందుకనే ఒక్కసారిగా మోత్కుపల్లిలోని అసహనం ఎన్టీఆర్ వర్ధంతి రోజు బయటపడింది.