లోపం జగన్లో ఉందా ? ఫిరాయింపుల్లోనా ?

Why so many MLAs are leaving YCRCP who is responsible
Highlights

  • ఎవరిలో లోపముందో అర్ధం కావటం లేదు. పార్టీ నాయకత్వంలోనా ? లేకపోతే ఫిరాయిస్తున్న ఎంఎల్ఏల్లోనా ?

ఎవరిలో లోపముందో అర్ధం కావటం లేదు. పార్టీ నాయకత్వంలోనా ? లేకపోతే ఫిరాయిస్తున్న ఎంఎల్ఏల్లోనా ? ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 23 మంది ఎంఎల్ఏలు పార్టీ నుండి దశలవారీగా ఫిరాయించటమంటే మామూలు విషయం కాదు. పోయిన ఎన్నికల్లో జగన్ నానా అవస్తులు పడి 67 మంది ఎంఎల్ఏలను ఎనిమిది మంది ఎంపిలను గెలిపించుకున్నారు. గెలిచిన వారికొచ్చిన ఓట్లలో అత్యధికులకు వైఎస్సార్, జగన్ పై ఉన్న అభిమానంతోనే జనాలు ఓట్లు వేసారన్నది వాస్తవం.

వంతల రాజేశ్వరి కావచ్చు, గిడ్డి ఈశ్వరి కావచ్చు లేదా మణిగాంధి, జ్యోతుల నెహ్రూ, భూమానాగిరెడ్డి కూడా కావచ్చు. ఒక్కోరిది ఒక్కో ఆవేధన. ఫిరాయించిన వారందరూ చెప్పే కామన్ పాయింట్ ఏంటంటే ‘ఆత్మాభిమానం దెబ్బతిన్నది’ అనే. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్షానికి వచ్చే ఏకైక క్యాబినెట్ ర్యాంకు పోస్టయిన పిఏసి ఛైర్మన్ పదవిని భూమా నాగిరెడ్డికి కట్టబెడితే చివరకు భూమా కూడా టిడిపిలోకి ఫిరాయించారు.

ఇక్కడే అందరికీ కొన్ని సందేహాలు వస్తున్నాయి. జగన్ నాయకత్వ లోపం వల్లే ఎంఎల్ఏలు పార్టీ ఫిరాయిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవదన్న అనుమానంతోనే ఫిరాయిస్తున్నారా? లేకపోతే చంద్రబాబునాయుడు ప్రలోభాలకు లొంగిపోవటం, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికే టిడిపిలోకి ఫిరాయిస్తున్నారా అన్నది అర్ధం కావటం లేదు. సరే, పార్టీ ఫిరాయించిన వారందరూ జగన్ పైన, వైసిపి పైన బురద చల్లటం మామూలే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావటానికి ఒకవైపేమో జగన్ పాదయాత్ర పేరుతో నానా అవస్తలు పడుతున్నారు. ఇంకోవైపేమో ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయిస్తున్నారు.

అదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపులందరికీ టిక్కెట్లు దక్కేది అనుమానమే అన్న ప్రచారం టిడిపిలోనే జరుగుతోంది. ఫిరాయింపు సమయంలో అవసరార్ధం చంద్రబాబు కూడా అనేక హామీలిస్తారు. ఒకసారి టిడిపిలో చేరిన తర్వాత అప్పటి సంగతి అప్పుడు చూసుకోవటమే. జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి లాంటి వాళ్ళ విషయంలో చంద్రబాబు ఏ విధంగా వ్యవహరించారో అందరూ చూసిందే. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్నా, ఫిరాయింపులందరకీ టిక్కెట్లు సాధ్యం కాదని ప్రచారం జరుగుతున్నా కూడా వైసిపి ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయిస్తున్నారంటే లోపం ఎక్కడుందో అర్ధం కావటం లేదు.

 

loader