న్యూఢిల్లీ:  తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో  అవినీతి పరులను జైల్లో పెడతామని ప్రకటించిన మోడీ వైసీపీ చీఫ్ జగన్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని ఏపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీక్షలో పాల్గొనేందుకు సోమవారం నాడు న్యూఢిల్లీకి వచ్చిన మంత్రి నారా లోకేష్‌ ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

మోడీ అవినీతి పరులతో అంటకాగుతున్నారని లోకేష్ విమర్శించారు. జగన్ కేసులు తిరిగి మొదటి నుండి విచారణ చేసే పరిస్థితికి రావడానికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. నిన్న గుంటూరులో ప్రధానమంత్రి సభ సక్సెస్ అయ్యేందుకు వైసీపీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. 

వైసీపీ నేతలు ఈ సభను  సక్సెస్ చేసేందుకు ప్రయత్నించారన్నారు. వైసీపీ ఫ్లెక్సీలు, బీజేపీ జెండాలతో  మోడీ సభకు జనాన్ని తరలించారని  లోకేష్ చెప్పారు. గుంటూరు సభ జరిగి 24 గంటలు దాటినా కూడ జగన్‌తో పాటు విపక్షాలు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

70 రోజుల తర్వాత మోడీ ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోతారని ఆయన జోస్యం చెప్పారు. కొత్తగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టే  వ్యక్తిని నిర్ణయించే పార్టీలు, వ్యక్తులు తమ దీక్షకు మద్దతును ప్రకటించారని లోకేష్ చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలో పొందుపర్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని  హమీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రిని తాము గౌరవిస్తామన్నారు. కానీ, అదే సమయంలో  తిరుపతి సభలో ఇచ్చిన హామీని అమలు పర్చకుండా మోడీ మోసం చేశారని చెప్పారు.

నాలుగేళ్ల పాటు ఏపీకి న్యాయం చేస్తామని  చూశామన్నారు. కానీ, ఏపీకి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించి పోరాటానికి దిగామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా తాము ప్రధానిని ప్రశ్నిస్తున్నామన్నారు.

తాను పుట్టే సమయానికే తాత, పెరిగే సమయానికి తండ్రి సీఎంగా ఉన్నారని లోకేష్ చెప్పారు. తాను విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేసినట్టు ఆయన గుర్తు చేశారు. తనపై చేసిన అవినీతి ఆరోపణల్లో ఒక్కటైనా రుజువు చేయగలరా అని ఆయన సవాల్ విసిరారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి 647 అవార్డులు వచ్చాయని చెప్పారు. ఇందులో ఎక్కువగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకే ఎక్కువగా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. కానీ, ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం తొక్కిపెట్టిందన్నారు.నాన్ బిజేపీ ప్రభుత్వాలకు ఈ పథకాల కింద నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదాను మించి ప్యాకేజీ ఇస్తామని ఇచ్చిన హామీలను కూడ మోడీ అమలు చేయలేదన్నారు.ఏపీ ప్రజల హక్కుల కోసం తాము రైట్ టర్న్ తీసుకొన్నామని లోకేష్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి....: మోడీపై కేజ్రీవాల్ ఫైర్

ఏపీ డిమాండ్లు నెరవేర్చాలి: ములాయం

దీక్ష: జయరామ్ రమేష్‌కు చంద్రబాబు కితాబు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు