లక్ష్మీపార్వతి-చంద్రబాబుల మధ్య ఉప్పు నిప్పు. కాబట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా చెప్పేందుకే కలిసి వుంటారన్నది ఓ ప్రచారం. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరేందుకే కలిసారన్నది మరో ప్రచారం. సరే కారణాలేవైనా గానీండి చంద్రబాబు వ్యతిరేకులకు మాత్రం మోడి అపాయింట్మెంట్ తేలిగ్గా ఎలా దొరుకుతోందో అర్ధం కాక టిడిపి నేతలు గింజుకుపోతున్నారనుకోండి.

ప్రధానమంత్రి నరేంద్రమోడి అంతరంగం ఏంటో టిడిపికి అంతుబట్టకుండా ఉంది. చంద్రబాబునాయుడు వ్యతిరేకులు మోడిని అంత తేలిగ్గా ఎలా కలవగలుగుతున్నారు? ఇపుడదే ప్రశ్న టిడిపిలో పలువురిని వేధిస్తోంది. తాను ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదన్నది పూర్తిగా ప్రధాని ఇష్టమే అనుకోండి అది వేరే సంగతి. కానీ చంద్రబాబును కలవటానికి ఏడాదిగా అవకాశం ఇవ్వని మోడి వరుసబెట్టి వ్యతిరేకులను మాత్రం కలవటమేంటో టిడిపి నేతలకు అర్ధం కావటం లేదు.

దాదాపు ఏడాది నుండి నరేంద్రమోడిని కలవటానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావటం లేదు. కారణాలేవైనా కానీండి చంద్రబాబును మాత్రం మోడి ఏకాంతంగా కలవటాన్ని ఇష్టపడటం లేదన్నది వాస్తవం. మొన్నటికి మొన్న గుజరాత్ లో జరిగిన టెక్స్ టైల్స్ షోకు మంత్రి అచ్చెన్నాయడు హాజరవ్వాలి. అయితే, మోడి వస్తున్నారని తెలియగానే చంద్రబాబు వెళ్ళారు. అప్పటికప్పుడు చంద్రబాబు వెళ్ళింది కేవలం మోడిని కలవచ్చనే. కానీ మోడి మాత్రం చంద్రబాబును కలవటానికి ఇష్టపడలేదట.

అదేవిధంగా ఆమధ్య అమెరికాకు వెళ్ళేముందు కూడా చంద్రబాబు ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పైగా సిఎం అమెరికా పర్యటనలో వుండగానే ప్రత్యేకించి మోడి వైసీపీ అధినేత జగన్ తో గంటకు పైగా మాట్లాడారు. అప్పటి నుండి అందరిలోనూ మోడి-చంద్రబాబు బంధంపై అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా వైసీపీకే చెందిన లక్ష్మీపార్వతిని కూడా మోడి కలవటంతో టిడిపిలో కలవరం మొదలైపోయింది.

జగన్ను కలిసారంటే సరే ఏదోలే ప్రధానప్రతిపక్ష నేత, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు అవసరం కాబట్టి కలిసారని సరిపెట్టుకున్నారు టిడిపి వాళ్లు. మరి లక్ష్మీపార్వతిని ఎందుకు కలిసినట్లు? అసలు అపాయింట్మెట్ ఇప్పించిందెవరు? అన్న విషయాలు తెలీక టిడిపి నేతలు గింజుకుంటున్నారు.

లక్ష్మీపార్వతి-చంద్రబాబుల మధ్య ఉప్పు నిప్పు. కాబట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా చెప్పేందుకే కలిసి వుంటారన్నది ఓ ప్రచారం. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరేందుకే కలిసారన్నది మరో ప్రచారం. మొన్న జగన్ ప్రధానిని కలిసినందుకే టిడిపి నేతలు మండిపోయారు. ఇపుడు లక్ష్మీపార్వతి కూడా కలవటంతో పుండు మీద కారం రాసినట్లైంది. సరే, కారణాలేవైనా గానీండి చంద్రబాబు వ్యతిరేకులకు మాత్రం మోడి అపాయింట్మెంట్ తేలిగ్గా ఎలా దొరుకుతోందో అర్ధం కాక టిడిపి నేతలు గింజుకుపోతున్నారనుకోండి.