రాష్ట్ర రాజకీయాల్లో అక్టోబర్ నెలలో రెండు ప్రధాన ఘట్టాలకు తెరలేస్తోంది ఒకటి: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. . రెండోది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనాల్లోకి వస్తున్నారు. తాను కూడా అక్టోబర్ నుండే పూర్తిస్ధాయిలో రాజకీయాల్లోకి దిగుతున్నట్లు సోమవారం ప్రకటించారు.
రాష్ట్ర రాజకీయాల్లో అక్టోబర్ నెలలో రెండు ప్రధాన ఘట్టాలకు తెరలేస్తోంది. ఒకటి: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలవ్వబోతోంది. రెండోది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనాల్లోకి వస్తున్నారు. అక్టోబర్లో పాదయాత్ర మొదలుపెడుతున్నట్లు మొన్నటి ప్లీనరీలో జగన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజాసమస్యలను దగ్గర నుండి చూసి తెలుసుకోవటానికే పాదయాత్ర చేయబోతున్నట్లు చెప్పారు. అంటే పాదయాత్ర కోసం జగన్ ముందుగానే ప్రిపేరయ్యారన్న విషయం తెలుస్తోంది.
ఇక, పవన్ విషయాన్ని చూస్తే, తాను కూడా అక్టోబర్ నుండే పూర్తిస్ధాయిలో రాజకీయాల్లోకి దిగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. జగన్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్న అక్టోబర్లోనే పవన్ కూడా పూర్తిస్ధాయి రాజకీయాల్లోకి దిగాలని ఎందుకు అనుకున్నారు? రెండు ఘట్టాలు ఒకేనెలలో మొదలవ్వటం కాకతాళీయమా లేక వ్యూహమేదైనా ఉందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి సర్వత్రా.
ఎందుకంటే, ఉద్దానం కిడ్నీ సమస్యపై సోమవారం సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు-పవన్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. బహుశా ఆ భేటీలో నంద్యాల ఉపఎన్నిక, ముద్రగడ ఉద్యమం, జగన్ పాదయాత్ర, వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోతుండటం లాంటి అనేక అంశాలపై మాట్లాడుకుని ఉండవచ్చు. నంద్యాల ఉపఎన్నిక విషయంలో పవన్ పాత్ర ఏంటో స్పష్టం కాలేదు. ఇక, ముద్రగడ ఉద్యమమంటారా అది జనాలకు అలవాటైపోయింది. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోవటం వీరిద్దరి చేతుల్లోనూ లేదు.
ఇక మిగిలింది జగన్ పాదయాత్ర మాత్రమే. జగన్ యాత్రకు వీలున్నంతగా బ్రేకులు వేయాలన్నదే చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. పాదయాత్ర చేయనీయకుండా ముద్రగడను హౌస్ అరెస్టు చేసినట్లు జగన్ విషయంలో సాధ్యం కాదు. కాబట్టే జగన్ కు కౌంటర్ సిద్ధం చేయాలి. కౌంటర్ చేసే స్ధాయి నేతలు టిడిపిలో లేరు, చంద్రబాబు చేయలేరు. కాబట్టే పవన్ను తెరపైకి తెస్తున్నారేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. వీరిద్దరి భేటీ తర్వాతే పవన్ మీడియాతో మాట్లాడుతూ తాను అక్టోబర్ నుండే జనాల్లోకి వస్తున్నట్లు చెప్పారు.
ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటే జనాల్లోనే ఉండాలి. అందుకు పాదయాత్రకన్నా మించింది లేదుకదా? గతంలో వైస్ అయినా చంద్రబాబైనా చేసిందదే కదా? తాను పాదయాత్ర చేయబోతున్నట్లు జగనే స్పష్టంగా ప్రకటించారు. కానీ పవన్ చేసిన ప్రకటనలో స్పష్టత లేదు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అక్టోబర్ నుండి పూర్తిస్ధాయి రాజకీయాల్లోనే ఉంటానని మాత్రమే ప్రకటించారు. మరి, పూర్తిస్ధాయి రాజకీయాల్లో ఉండటమంటే ఏం చేస్తారో చూడాలి?
