ఎన్నికల్లో గెలవటానికి ఇన్ని అవస్తలు పడుతున్న టిడిపి, మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీని సాయం చేయమని అడగటాన్ని మాత్రం నామోషిగా ఫీలవుతున్నట్లుంది. నెలరోజులుగా నియోజకవర్గంలో టిడిపి ప్రచారం మొదలుపెట్టినా ఇప్పటి వరకూ భాజపాను మాత్రం ప్రచారానికి రమ్మని అడగకపోవటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? భాజపా కండువా లేకుండా ప్రచారంలోకి రావాలని షరతు విధించారు. అవసరమేమో టిడిపిది. సాయం చేయాల్సిందేమో భాజపా. అయినా టిడిపి నేతలు రివర్స్ లో మాట్లాడటంతో భాజపా నేతలు మండిపోతున్నారు. ఎంత తక్కువగా చూసినా నంద్యాల నియోజకవర్గంలో భాజపాకు సుమారు 10 వేల ఓట్లున్నాయి. ప్రస్తుత పరిస్ధితిలో 10 వేల ఓట్లు అంటే చిన్న సంఖ్యేమీకాదు.

నంద్యాలలో తెలుగుదేశంపార్టీ నేతల పరిస్ధితి విచిత్రంగా ఉంది. ఒకవైపు ఉపఎన్నికల్లో గెలవటానికి నానా అవస్తలు పడుతున్న సంగతి అందరూ చూస్తున్నదే. అభ్యర్దికి జనాలు తలంటుతున్నారు. స్వయంగా చంద్రబాబే నియోజకవర్గంలో ఇప్పటికి రెండుసార్లు పర్యటించారు. ఎవరివరికో ఆచరణసాధ్యం కాని వరాలను ఇచ్చేస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను విడదీసి తాయిలాలను ప్రకటిస్తున్నారు. జిల్లాలో నేతలు కాకుండా పదిమంది మంత్రులు 25 మంది ఎంఎల్ఏలు, ఐదుగురు ఎంఎల్సీలు ప్రచారం చేస్తున్నారు. దీన్ని బట్టే టిడిపి పరిస్ధితి ఏంటనేది ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు.

అయితే, ఎన్నికల్లో గెలవటానికి ఇన్ని అవస్తలు పడుతున్న టిడిపి, మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీని సాయం చేయమని అడగటాన్ని మాత్రం నామోషిగా ఫీలవుతున్నట్లుంది. ఎందుకంటే, దాదాపు నెలరోజులుగా నియోజకవర్గంలో టిడిపి ప్రచారం మొదలుపెట్టినా ఇప్పటి వరకూ భాజపాను మాత్రం ప్రచారానికి రమ్మని అడగకపోవటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? అయితే, జిల్లా నేతలు మాత్రం ఒకసారి పిలిచారట. అది కూడా ఎలాగంటే, భాజపా కండువా లేకుండా ప్రచారంలోకి రావాలని షరతు విధించారు.

మిత్రపక్ష హోదాలో తమ పార్టీ కండువా కప్పుకుని ప్రచారంలోకి వస్తే ఏమవుతుందన్న భాజపా నేతల ప్రశ్నకు టిడిపి నేతల వద్ద సమాధానం లేదు. పైగా ‘అవసరమనుకుంటే ప్రచారానికి రమ్మం’టూ టిడిపి నేతలు కబురు చేసారు. దాంతో భాజపా నేతలకు ఒళ్ళుమండి అసలు ప్రచారానికే దూరంగా ఉన్నారు. అవసరమేమో టిడిపిది. సాయం చేయాల్సిందేమో భాజపా. అయినా టిడిపి నేతలు రివర్స్ లో మాట్లాడటంతో భాజపా నేతలు మండిపోతున్నారు.

ఎంత తక్కువగా చూసినా నంద్యాల నియోజకవర్గంలో భాజపాకు సుమారు 10 వేల ఓట్లున్నాయి. ప్రస్తుత పరిస్ధితిలో 10 వేల ఓట్లు అంటే చిన్న సంఖ్యేమీకాదు. వంద ఓట్లు, 200 ఓట్లున్నాయనుకున్న వాళ్ళని కూడా స్వయంగా చంద్రబాబే బ్రతిమలాడుకుంటన్నారు గట్టిగా పనిచేయమని. అటువంటిది మిత్రపక్షాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. అంటే, రేపొద్దున ఫలితంలో ఏదైనా తేడాకొడితే నెపమంతా భాజపా మీద వేసేసే వ్యూహమేదైనా ఉందేమో చూడాలి.