కమిటి సమావేశాల్లో సభ్యులు, అధికారులు తప్ప ఇంకెవరూ ఉండేందుకు లేదు. కాబట్టి అధికారులు అడ్డంగా బుక్కైపోతారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలు పెంచేసిన విషయం బయటపడుతుందని చంద్రబాబునాయుడు భయపడుతున్నట్లే కనబడుతోంది. అందుకనే ప్రాజెక్టుల వద్దకు అసెంబ్లీ అంచనాల కమిటి పర్యటించకుండా ప్రభుత్వమే అడ్డుకుంటోంది. మామూలుగా అయితే, అంచనాల కమిటి ఏ ప్రాజెక్టు దగ్గరకైనా వెళ్ళి పరిశీలించవచ్చు, అంచనాల పెంపుపై విచారణ చేయవచ్చు. కానీ కమిటి ఏ ప్రాజెక్టు వద్దకూ వెళ్ళలేకపోతోంది. కనీసం కమిటి సమావేశాలకు నీటి పారుదల శాఖ కార్యదర్శి హాజరు కూడా కావటం లేదట.

ఇప్పటికి మూడు సార్లు పోలవరం, పట్టిసీమ తదితర ప్రాజెక్టుల పనులను క్షేత్రస్ధాయికి వెళ్లి పరిశీలించాలని కమిటి నిర్ణయించినా సాధ్యం కావటం లేదు. దాంతో కమిటి సభ్యుల్లో అసంతృప్తి పేరుకుపోతోంది. విచిత్రమేమిటంటే కమిటి ఛైర్ పర్సన్ మోదుగుల వేణుగోపాలరెడ్డితో పాటు మెజారిటి సభ్యులు టిడిపి వారే. అయినా సరే ప్రాజెక్టుల పరిశీలన కోసం కమిటి క్షేత్రస్ధాయికి ఎందుకు వెళ్లలేకపోతున్నట్లు?

కారణం వెరీ సింపుల్. ప్రభుత్వం అడ్డుకుంటోంది. కమిటి గనుక క్షేత్రస్ధాయిలో పరిశీలనకు వెళితే, కమిటీలోని వైసీపీ సభ్యుల ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పాలి. అంతేకాకుండా రికార్డులూ చూపాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతీ ప్రాజెక్టుకూ అంచనా వ్యయాలు బాగా పెరిగిపోయాయన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. అదే విషయాలపై సభ్యులు ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పాల్సి వస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.

ఎందుకంటే, అంచనాలు పెంచేసిన సంగతి రికార్డుల్లో స్పష్టంగా కనబడుతుంది. కమిటి సమావేశాల్లో సభ్యులు, అధికారులు తప్ప ఇంకెవరూ ఉండేందుకు లేదు. కాబట్టి అధికారులు అడ్డంగా బుక్కైపోతారు. అదే మీడియా సమావేశాల్లోనో ఇతర వేదికలపైనో ప్రతిపక్షంపై సిఎం, మంత్రి విరుచుకుపడినట్లు కాదు కదా. కాబట్టి కమిటి పర్యటనలే కాదు అసలు సమావేశాలనే జరగనీయకుండా చేసేస్తే సరిపోతుందని ప్రభుత్వ పెద్దలు భావించినట్లు సమాచారం.

అయితే, సమావేశాల నిర్వహణ, పర్యటనలు పూర్తిగా కమిటి సభ్యుల నిర్ణయమే. అందుకనే జరుగుతున్న వ్యవహారాలకు ఎక్కడా రాతపూర్వకంగా ఆదేశాలుండవు.

సమావేశాల నిర్వహణకు, క్షేత్రస్ధాయి పర్యటనలకు ఏర్పాటు చేయాలంటూ కమిటి అధికారులను ఆదేశిస్తున్నది. ఏర్పాట్లు ఏమీ చేయవద్దని ప్రభుత్వం నుండి ఒత్తిడి వస్తున్నది. మధ్యలో అధికారుల పరిస్ధితి ‘విడవమంటే పాముకు కోపం...కరవమంటే కప్పకు కోపం’ అన్నట్లు తయారైంది.

ప్రాజెక్టులపై చర్చకు తాజాగా మంగళవారం సమావేశమవ్వాలని కమిటి నిర్ణయించింది. ఈ విషయమై గతంలోనే సభ్యులకు సమాచారం కూడా అందింది. అయితే, యధారీతిగా సమావేశం వాయిదాకు ప్రభుత్వం ఒత్తిడిపెడుతున్నది. ఈ పరిస్ధితిల్లో ఏమి చేయాలో అధికారులకు దిక్కుతోచటం లేదు.