వివిధ పధాకల క్రింద కేంద్రం విడుదల చేసిన నిధులకు రాష్ట్రప్రభుత్వం లెక్కలు చెప్పటం లేదు. అందుకనే తదుపరి నిధుల విడుదలలో కేంద్రం నిధులివ్వకుండా బిగించేస్తోంది.
వివిధ పధాకల క్రింద కేంద్రం విడుదల చేసిన నిధులకు రాష్ట్రప్రభుత్వం లెక్కలు చెప్పటం లేదు. అందుకనే తదుపరి నిధుల విడుదలలో కేంద్రం నిధులివ్వకుండా బిగించేస్తోంది. గడచిన మూడున్నరేళ్ళల్లో సుమారుగా రూ. 4 వేల కోట్లకు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లెక్కలు చెప్పలేదు. నూతన రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 2500 కోట్లకు ఇంత వరకూ లెక్కలు చెప్పలేదు. సర్వశిక్ష అభియాన్ క్రింద రాష్ట్రానికి వచ్చిన నిధుల్లో రూ. 511 కోట్లకు లెక్కలు పంపలేదు. అందుకనే తర్వాత విడుదలవ్వాల్సిన రూ. 381 కోట్లు ఆగిపోయాయి.

మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు క్రింద రూ. 212 కోట్లు, ప్రణాళికేతర రెవెన్యూ గ్యాప్ రూపంలో రూ. 139 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం క్రింద రూ. 92 కోట్లు, పోస్ట్ మెట్రిక్ ఎస్టీ ఉపకార వేతనాల పథకం క్రింద రూ. 80 కోట్లు, ఐసిడిఎస్ లో విడుదలైన రూ. 43 కోట్లకు లెక్కలు లేవు..ఇలా చెప్పుకుంటూ పోతే రూ. 600 కోట్లకు కేంద్రానికి లెక్కలు చెప్పలేదు. అందుకనే కేంద్రం కూడా వివిధ పధకాల అమల్లో రాష్ట్రానికి నిధులను నిలిపేయటమో లేక తగ్గించేయటమో చేస్తోంది.

ఏపి విషయంలో మొదటి నుండి కేంద్రం వివక్ష చూపిస్తున్నది వాస్తవమే. అయితే అందుకు చంద్రబాబునాయుడు వ్యవహారశైలి కూడా కారణమే. ఇచ్చిన డబ్బుకు లెక్కలు చెప్పకపోతే మళ్ళీ ఎవరు డబ్బిస్తారు? అసలు కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబు సర్కార్ ఎందుకు లెక్కలు చెప్పలేకపోతోంది? కేంద్రం డబ్బిస్తోంది, రాష్ట్రం ఖర్చు పెడుతోంది. అయితే, ఆ ఖర్చే ఏ అవసరాలకు చేస్తోందన్నదే సస్పెన్స్. ఖర్చు ఏ రూపంలో చేసారో చెప్పమంటే రాష్ట్రప్రభుత్వం చెప్పటం లేదు. రుణమాఫీ, చంద్రన్న కానుకలు, ప్రత్యేక విమాన ఖర్చులు ఇలా అనేక రూపాల్లో పక్కదారి పట్టాయన్నది కేంద్రం అనుమానిస్తున్నట్లు సమాచారం.

అందుకనే కేంద్రం నుండి నిధులు రాకున్నా నిలదీయటానికి చంద్రబాబుకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయంలోనే కేంద్రం, రాష్ట్రప్రభుత్వాన్ని బిగించేస్తోంది. అందులో భాగమే కేంద్రం అమలు చేస్తున్న 44 పథకాలల్లో ఏపి వాటా తగ్గిపోవటం. మిగిలిన రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తున్న కేంద్రం ఒక్క ఏపికి మాత్రం దాదాపు ఆపేస్తోంది. మొత్తం 44 పథకాల్లో 24 పథకాల అమలులో తీవ్ర అన్యాయం జరుగుతోంది. మరో 8 పథకాల్లో అయితే వచ్చిన నిధులు దాదాపు సున్నా. ఇక మిగిలిన పథకాల్లో మాత్రం ఏదో పర్వాలేదు అన్నట్లుగా ఉంది నిధుల కేటాయింపు. కేంద్రం అమలు చేస్తున్న అన్నీ పథకాల్లో కలిపి ఏపికి దక్కింది కేవలం రూ. 1880 కోట్లే. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు కేంద్రం రాష్ట్రాన్ని ఎంతలా ఆడుకుంటోందో ?
