చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే ఇప్పట్లో రాజధాని నిర్మాణం చేసే ఉద్దేశ్యం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే మూడున్నర సంవత్సరాల విలువైన కాలం వృధా చేసారు. తాజాగా బ్రిటన్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ అందించిన డిజైన్లు కుడా చంద్రబాబుకు నచ్చలేదు. పైగా డిజైన్లను రూపొందించటంలో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళిని సంప్రదించాలని ఉన్నతాధికారులను ఆదేశించటం విచిత్రంగా ఉంది.

చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే ఇప్పట్లో రాజధాని నిర్మాణం చేసే ఉద్దేశ్యం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే మూడున్నర సంవత్సరాల విలువైన కాలం వృధా చేసారు. అనేకమంది ఆర్కిటెక్టులను సంప్రదించారు. వందల కోట్ల రూపాయలు చెల్లించారు. అయినా వారిచ్చిన డిజైన్లేవీ చంద్రబాబుకు నచ్చలేదు. అంటే కోట్ల రూపాయల వృధా అనేకదా అర్ధం. తాజాగా బ్రిటన్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ అందించిన డిజైన్లు కుడా చంద్రబాబుకు నచ్చలేదు. పైగా డిజైన్లను రూపొందించటంలో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళిని సంప్రదించాలని ఉన్నతాధికారులను ఆదేశించటం విచిత్రంగా ఉంది. ఇప్పటికే ఫోస్టర్ అందచేసిన డిజైన్లను నాలుగు సార్లు మార్చారు.

రాజధాని నిర్మాణానికి సంబంధించి డిజైన్ల విషయంలో గతంలోనే రాజమౌళిని సంప్రదించినపుడు ఆయన కుదరదని తేల్చేసారు. అయినా రాజమౌళిని చంద్రబాబు వదలటం లేదు. బహుశా చంద్రబాబుకు బాహుబలి సెట్టింగులు తెగ నచ్చేసినట్లున్నాయి. అందుకనే ఏ ఆర్కిటెక్ట్ డిజైన్లను అందచేసినా వాటిని బాహుబలి సెట్టింగులతో పోల్చిచూస్తున్నట్లు కనబడుతోంది. బాహుబలి సెట్టింగులు అందరినీ ఆకట్టుకున్న మాట వాస్తవం. కానీ అవన్నీ కేవలం సినిమా కోసం వేసిన సెట్టింగులన్న విషయం చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. అవేవి వాస్తవ జీవితంలో సాధ్యపడవు. నిజంగా అటువంటి డిజైన్లలోనే రాజధాని నిర్మించాలంటే దశాబ్దాలు పడుతుందన్న విషయం చంద్రబాబుకు తెలీదా?

తెలిసికుడా డిజైన్లు ఫైనల్ చేయటంలో జాప్యం చేస్తున్నారంటే అర్ధమేంటి? వచ్చే ఎన్నికలను దృష్టి పెట్టుకునే డిజైన్లు ఫైనల్ చేయకుండా ఇపుడు తాత్సారం చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే, ఇపుడు గనుక డిజైన్లు ఫైనల్ చేసేస్తే వెంటనే నిర్మాణాలు మొదలుపెట్టాలి. నిర్మాణాలు మొదలుపెట్టాలంటే చేతిలో డబ్బులేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. చేతిలో రూపాయి లేకుండానే వేలకోట్ల రూపాయలతో ప్రణాళికలు వేస్తున్నారు. అందుకనే సరిగ్గా ఎన్నికలకు ముందు డిజైన్లు ఫైనల్ అయ్యాయని చెప్పి తూతూ మంత్రంగా నిర్మాణాలు మొదలుపెట్టి ఎన్నికలకు వెళతారేమో మొన్న నంద్యాలలో చేసినట్లే. ఇంకెన్ని డిజైన్ల డ్రామాలు చూడాలో.