అభ్యర్ధి గురించి ప్రకటించాల్సింది తాను తప్ప ఇంకెవరూ నోరు విప్పేందుకు లేదన్నారట. ఈ విషయమై ఇంకెక్కడా మాట్లాడవద్దని స్పష్టంగా చెప్పారట. తన తండ్రి భూమానే చంద్రబాబు రాజకీయాన్ని తట్టుకోలేకపోతే పాపం మొదటిసారి ఎంఎల్ఏ, మొదటిసారి మంత్రి అయిన అఖిలప్రియ ఎంత?

మంత్రి అఖిలప్రియ నోటికి చంద్రబాబునాయుడు తాళం వేసేసారు. సిఎం రాజకీయం ఎలాగుంటుందో అఖిలకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. తన తండ్రి, దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డే ముఖ్యమంత్రి దెబ్బకు కళ్ళు తేలేసారు. అటువంటిది అఖిల ఏపాటి. నాగిరెడ్డి చంద్రబాబు గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. అటువంటిది వైసీపీని వీడి టిడిపిలో చేరిన తర్వాత తన పరిస్ధితి ఎంత దయనీయంగా మారిపోయిందో భూమా తన అనుచరులతో చెప్పుకుని బాధపడేవారట. సరే, హటాత్తుగా మరణించటంతో నంద్యాల రాజకీయం ప్రస్తుతం రసవత్తరంగా మారిందనుకోండి.

భూమా మరణంతో ఖాళీ అయిన సీటులో తమ కుటుంబమే పోటీ చేస్తుందని, 24వ తేదీన అభ్యర్ధిని కూడా ప్రకటిస్తానంటూ నాలుగు రోజుల క్రితం అఖిల విజయవాడలో ప్రకటించారు. మంత్రి ప్రకటనతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా అభ్యర్ధిని ప్రకటిస్తారని కూడా మంత్రి చెప్పారు. అయితే, ఈ రోజు వర్ధంతి కూడా అయిపోయింది. కానీ అభ్యర్ధిని మాత్రం అఖిల ప్రకటించలేదు. కారణమేమిటంటే సిఎంను కలిసి మాట్లాడిన తర్వాతే అభ్యర్ధిని ప్రకటిస్తామంటూ మంత్రి తాజాగా చెబుతున్నారు.

ఇంతకీ మంత్రి ఎందుకు మాట మార్చారు? విజయవాడలో అభ్యర్ధి గురించి మంత్రి చేసిన ప్రకటన చంద్రబాబు దృష్టికి వెళ్లింది. వెంటనే సిఎం అఖిలకు క్లాస్ పీకారట. అభ్యర్ధి గురించి ప్రకటించాల్సింది తాను తప్ప ఇంకెవరూ నోరు విప్పేందుకు లేదన్నారట. ఈ విషయమై ఇంకెక్కడా మాట్లాడవద్దని స్పష్టంగా చెప్పారట. నంద్యాలలో పోటీ చేసే అవకాశం భూమా కుటుంబానికే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే తాజగా ఆ ప్రచారానికి తెరపడింది.

నంద్యాలలో పోటీ చేసే విషయమై మొదటి నుండి గట్టి పట్టుదలతో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి అభ్యర్దిత్వాన్ని కూడా సిఎం తాజాగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంటే అఖిల కుటుంబానికి టిక్కెట్టు ఇచ్చేది గ్యారెంటీ లేదన్న మాట. జరుగుతున్న పరిణామాలతో అఖిలలో అయోమయం మొదలైంది. మొత్తం మీద శిల్పా సోదరుల ఒత్తిడికి చంద్రబాబు లొంగిపోతున్నారంటూ ప్రచారం మొదలైంది.

ఎప్పుడైతే చంద్రబాబు మాట్లాడారో అప్పటి నుండే అఖిల గొంతు మూగబోయింది. ఇప్పుడిప్పుడే చంద్రబాబు రాజకీయం అఖిలకు అర్ధమవుతోంది. తన తండ్రి భూమానే చంద్రబాబు రాజకీయాన్ని తట్టుకోలేకపోతే పాపం మొదటిసారి ఎంఎల్ఏ, మొదటిసారి మంత్రి అయిన అఖిలప్రియ ఎంత?