చంద్రబాబుకు షాక్ తప్పదా ? పోలవరాన్ని కేంద్రం లాగేసుకుంటోందా?

First Published 11, Dec 2017, 5:43 PM IST
Why is union minister Gadkari wanting to physically verify polaram project
Highlights
  • చంద్రబాబునాయుడు చేతిలో నుండి పోలవరం ప్రాజెక్టును కేంద్రం లాగేసుకుంటోందా?

చంద్రబాబునాయుడు చేతిలో నుండి పోలవరం ప్రాజెక్టును కేంద్రం లాగేసుకుంటోందా? హిడెన్ అజెండాతోనే ఈనెల 22న ప్రాజెక్టును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి  సందర్శిస్తున్నారా ? ప్రత్యేక ఆదేశాలతోనే కేంద్రమంత్రి పోలవరం సైట్ కు వస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకున్నదన్న తీవ్ర ఆరోపణల నేపధ్యంలో గడ్కరీ పోలవరంను సందర్శిస్తుండటంతో పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రాజెక్టులో జరిగినట్లు ప్రచారంలో ఉన్న అవినీతి బయటకు రావాలంటే పోలవరం కేంద్రం పరిధిలోకి వెళితేనే సాధ్యమని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అందుకనే ఇక నుండి ప్రాజెక్టు పనులను తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని గడ్కరీ చెప్పటంలో అర్ధమదేనా ?

కేంద్రం తరపున పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కమిటీలన్నీ కూడా పనులు సక్రమంగా జరగటం లేదనే చెప్పాయి. అంతేకాకుండా ప్రాజెక్టు పనుల్లో భారీ ఎత్తున అవినితి జరిగిందని కూడా చెప్పాయి. కమిటీలిచ్చిన నివేదికలన్నింటినీ మంత్రి పరిశీలించిన తర్వాతే స్వయంగా సైట్ ను పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే తన వెంట కేంద్రం నుండి కీలకమైన అధికారులను కూడా తీసుకువస్తున్నారు. దాంతో గడ్కరీ పర్యటన సాధారణ పర్యటన కాదని అర్ధమవుతోంది.

కేంద్రమంత్రి తాజా ప్రకటనతో పోలవరం ప్రాజెక్టు ప్రత్యక్షంగా కేంద్రం పర్యవేక్షణలోకి వెళ్ళిపోతోందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే, ఈనెల 22న గడ్కరీ పోలవరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. 22వ తేదీనే ప్రాజెక్టుకు సంబంధించి సమీక్ష జరుపనున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. 2018కల్లా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని కేంద్రమంత్రి చెప్పటం గమనార్హం.

ఇక్కడే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.  మూడున్నరేళ్ళుగా ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర పర్యవేక్షణలో పనులు జరుగుతుంటే, కేంద్రం ఎలా ప్రత్యక్షంగా పర్యవేక్షించగలుగుతుంది ? అటువంటిది ఇకనుండి ప్రాజెక్టు పనులను తానే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని కేంద్రమంత్రి చెప్పటంలో అర్ధమేంటి ? పైగా పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు చెప్పటం విచిత్రంగా ఉంది. కొద్ది రోజులుగా పనులు పెద్దగా సాగటం లేదన్నది వాస్తవం.

పనిలో పనిగా గడ్కరీ బిల్లులకు సంబంధించి పెద్ద బాంబే పేల్చారు. ప్రాజెక్టుకు సంబధించి తమ వద్ద బిల్లులేవీ పెండింగ్ లో లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబునాయుడేమో కేంద్రం నుండి సుమారు రూ. 2600 కోట్ల విలువైన బిల్లులు బకాయిలో ఉందని చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరు చెబుతున్నది వాస్తవం? ఏపి సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తుందని కూడా చెబుతున్నారు గడ్కరీ. పనులు రాష్ట్రప్రభుత్వం చేస్తుంటే సహకరించాల్సింది కేంద్రం కదా? అటువంటిది కేంద్రమంత్రి రివర్స్ లో చెబుతున్నారేంటి? ఏంటో అంతా గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం తొలగాలంటే 22వ తేదీ వరకూ వేచి ఉండాల్సిందేనేమో ?

 

loader