రాజ్యసభ నుండి ఆచార్యులు రిలీవ్ అయి వెలగపూడికి చేరుకున్నారు. మూడు రోజులుగా  అసెంబ్లీ, సచివాలయం చుట్టూనే తిరుగుతున్నారు. మొత్తం మీద ఆచార్యులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చింది లేనిది అన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం స్పష్టంగా చెప్పకపోవటం గమనార్హం.

శాసనసభకు నూతన కార్యదర్శిని నియమించే విషయంలో ప్రభుత్వం బాగా గోప్యత పాటిస్తోంది. రాజ్యసభలో అడిషినల్ సెక్రటరీగా పనిచేస్తున్న పిపికె ఆచార్యులను అసెంబ్లీకి కొత్త కార్యదర్శిగా నియమించాలని ప్రభుత్వంలోని పెద్దలు గతంలోనే నిర్ణయించారు.

అయితే, వివిధ కారణాల వల్ల అప్పట్లో జాప్యం జరిగింది. అయితే, ప్రస్తుతం ఇన్ఛార్జ్ కార్యదర్శిగా ఉన్న డిప్యుటి కార్యదర్శి కె. సత్యనారాయణ అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయన సర్వీసు రికార్డులు, విద్యార్హతలపై కోర్టు, సమాచార హక్కు చట్టంలో విచారణ కూడా జరుగుతోంది.

ఇంతటి వివాదాస్పద వ్యక్తిని ఇన్చార్జ్ కార్యదర్శిగా నియమించటంపై వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తున్నారు.

సత్యనారాయణ వ్యవహారం మొదటి నుండి వివాదాస్పదమే. అంతేకాకుండా సభలో చర్చలు, అధికార-ప్రతిపక్షాల మధ్య వివాదాలు తలెత్తినపుడు అధికారపక్షానికి సమర్ధవంతంగా మార్గదర్శనం చేయలేకపోయారన్న ఆరోపణలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ కారణంతోనే ప్రభుత్వంలోని ముఖ్యుల్లో సత్యనారాయణపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని కూడా సమాచారం.

అందుకే వెంటనే పట్టాభి పరాంకుశ కృష్ణమాచారిని వెంటనే కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాలంటూ ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. దాంతో రాజ్యసభ నుండి ఆచార్యులు రిలీవ్ అయి వెలగపూడికి చేరుకున్నారు.

అయితే, ఆచార్యులను చేర్చుకోనీకుండా కొందరు అడ్డుపడుతున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకే ఆయన వద్ద జాయినింగ్ రిపోర్టు తీసుకోకుండా అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు. మూడు రోజులుగా ఆచార్యులు అసెంబ్లీ, సచివాలయం చుట్టూనే తిరుగుతున్నారు.

మొత్తం మీద ఆచార్యులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చింది లేనిది అన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం స్పష్టంగా చెప్పకపోవటం గమనార్హం.