Asianet News TeluguAsianet News Telugu

ముందస్తుకు చంద్రబాబు వ్యతిరేకం: ఎందుకంటే...

 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ముందస్తు ఎన్నికల అంశం దేశ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినలో పర్యటించారని ప్రచారం. దీంతో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల సమరంపై చర్చించుకుంటున్నాయి. 
 

Why Chandrababu  not ready for early polls
Author
Amaravathi, First Published Aug 28, 2018, 11:42 AM IST

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ముందస్తు ఎన్నికల అంశం దేశ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినలో పర్యటించారని ప్రచారం. దీంతో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల సమరంపై చర్చించుకుంటున్నాయి. 

ఇతర రాష్ట్రాల సంగతి అటుంచితే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ ముందస్తు ఎన్నికల అంశంపై పెద్ద ఎత్తున చర్చజరుగుతుంది. ముఖ్యంగా అధికారపార్టీ తెలుగుదేశంలో ఎక్కువ చర్చ జరుగుతుంది. పొత్తులపై అధినేత మాటను సైతం ధిక్కరించి కామెంట్లు చేస్తున్న నేతలు ముందస్తు ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా చర్చించుకుంటున్నారట.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సీఎం చంద్రబాబునాయుడు దగ్గర ప్రస్తావిస్తే ఆయన ససేమిరా అన్నారు. 2004 ఎన్నికల్లో కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ ప్రభుత్వాలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాయి. ఆ సమయంలో కేంద్రంతో పాటు ఇరు రాష్ట్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందని అలాంటి సమయాల్లో ముందస్తుకు వెళ్లడం సరికాదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రబడ్జెట్ లోటులో ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చెయ్యడంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉన్నామని తెలిపారు. కేంద్రప్రభుత్వ మెుండి చేయి చూపినా అధైర్య పడకుండా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. 

మరోవైపు ముందస్తుకెళ్తే తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని, 2004 ఫలితాలే పునరావృతమవుతాయని కొందరు నేతలు  అభిప్రాయపడుతున్నారట. తెలుగుదేశం పార్టీ దాదాపుగా పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి 2014 ఎన్నికల్లో గెలుపొందింది. అప్పటి నుంచి పార్టీని నమ్ముకుని నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి ఊరడిస్తారనుకున్నారు. 

అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి వలసలను ఎలా ప్రోత్సహించారో అదే తీరును చంద్రబాబు నాయుడు అమలు పరిచారు. వైసీపీ నుంచి వలసలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చిన్న పదవుల్లో ఉన్న నేతలను సైతం తమ పార్టీలోకి ఆహ్వానించారు. 

అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను సైతం కట్టబెట్టారు. దీంతో ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవిసరిపోవన్నట్లు కొంతమందికి నామినేటెడ్ పదవులను సైతం కేటాయించారు. దీంతో కొంతమంది టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తొమ్మిదేళ్లపాటు పార్టీ జెండాను భుజానపెట్టుకుని మోస్తే పార్టీ తమకేమిచ్చిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు...

ఇవన్నీ ఒక ఎత్తైతే వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో టిక్కెట్ల కేటాయింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. టీడీపీనే నమ్ముకుని ఉన్న నేతలను కాదని వలస వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇస్తే పార్టీకి తీరని నష్టం ఏర్పడుతుందని టీడీపీ అంచనా వేస్తుంది. ఎన్నికల సమరానికి టీడీపీ సిద్ధం అని చెప్తున్నా పార్టీలోని అంతర్గత సమరాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో ఆలోచిస్తుందట. 

ఈసారి ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుల్లో సీఎం చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. వైసీపీని కాదని టీడీపీలోకి వచ్చిన నేతలకు టిక్కెట్ ఇస్తే టీడీపీ నేతల్లో అసంతృప్తి, టీడీపీని కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్ ఇస్తే మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోతారేమోనని భయం. ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్న చందంగా టీడీపీ పరిస్థితి ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో ముందస్తుకు వెళ్తే కొంప మునిగిపోద్దని భావించిన టీడీపీ ముందస్తు ఎన్నికల ప్రస్తావనను పార్టీ గేటు దరిదాపుల్లోకి రానియ్యడం లేదు.    

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సై అంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. వైసీపీలోనూ అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటే అవే సర్ధుకుంటాయని భావిస్తోంది. 

ఎన్నికల సమరానికి ఆరు నెలల ముందు నుంచి వరాల జల్లు ప్రకటించడంతోపాటు తాయిళాలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకుంటుందని...అదే ముందస్తు అయితే ఆ అవకాశం ఉండబోదని ఊహిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా..యధావిధిగా ఎన్నికలు జరిగినా గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.    
 

Follow Us:
Download App:
  • android
  • ios