రాష్ట్రంలోని బిజెపి నేతలు అడ్రస్ లేకుండా పోయారు. బడ్జెట్ తర్వాత జనాలకు ముఖం చూపించలేక ఇబ్బందులు పడుతున్న నేతలపై మోడి పెద్ద గుండు పడేశారు. పార్లమెంటులో మోడి చేసిన ప్రసంగంతో బిజెపి నేతలు జనాలకు ఏమని సమాధానం చెప్పుకోవాలో అర్ధంకాక అడ్రసే లేకుండా పోయారు. చంద్రబాబునాయుడుపై ఒంటికాలిపై లేచే ఎంఎల్సీ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, దగ్డుబాటి పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు తదితరులు 24 గంటలుగా మీడియా ముఖం చూడలేదంటేనే అర్ధమైపోతోంది వారి ఇబ్బందులేంటో?

ఇంతకీ బిజెపి నేతలకు వచ్చిన అంత ఇబ్బందులేంటి? అంటే, పార్లమెంటులో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపి ప్రయోజనాల గురించి ఒక్క ప్రస్తావన కూడా లేదు. దాంతో బిజెపి మినహా అన్నీ రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయినా జైట్లీ బడ్జెట్ పై నేతలు, బిజెపి మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు సమర్ధిస్తు మాట్లాడారు.

అయినా ఏదో తంటాలు పడుతూ మీడియాతో మాట్లాడుతున్నారు. అందులో కూడా మంత్రులు మినహా మిగిలిన నేతలు చంద్రబాబునాయుడునే లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలతో కాలం గడుపుతున్నారు. అటువంటిది గురువారం పార్లమెంటులో మోడి చేసిన ప్రసంగం మాత్రం నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేసిందనే చెప్పాలి.

ఎందుకంటే, బడ్జెట్లో జైట్లీ ఏపి ప్రస్తావన తేలేదనే అనుకుందాం. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో మొదలైన నిరసనలు, ఆందోళనలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. దాని పర్యవసానమే పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఎంపిలు నాలుగు రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. అది చూసిన తర్వాతైన మోడి కళ్ళు తెరవాల్సింది. కానీ రెండు గంటల పాటు ఉభయ సభల్లోనూ మాట్లాడిన మోడి కూడా ఏపికి ఏమి చేయదలుచుకున్నదీ ప్రస్తావించనే లేదు. దాంతో రాష్ట్రంలోని బిజెపి నేతలకు కేంద్రం చర్యలను ఏ విధంగా సమర్ధించాలో అర్దం కాక అసలు అడ్రసే లేకుండా పోయారు.