చంద్రబాబునాయుడు ఎంతో గొప్పగా చెప్పుకునే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో ఏపి వెనకబడిపోయింది. తాజాగా ప్రకటించిన జాబితాలో రాష్ట్రం 15వ స్ధానానికి పడిపోయింది. అయితే, పొరుగునే ఉన్న తెలంగాణా మొదటి స్ధానంలో కొనసాగుతుండటం విశేషం. ప్రపంచ బ్యాంకుతో కలిసి డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) రాష్ట్రాల సామర్ధ్యాన్ని పరిశీలించి ర్యాంకులు ప్రకటిస్తుంది. ఈ ర్యాంకుల్లో తెలంగాణా తర్వాత బీహార్, ఒడిస్సా, అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలుండటం గమనార్హం. దీన్ని బట్టి డ్యాష్ బోర్డ్ అని, నూతన పారిశ్రామిక విధానమని ప్రభుత్వం చెబుతున్నవన్నీ ఉత్త సొల్లు కబుర్లేనని తేలిపోయింది.

తాజా పరిశీలనలో ఏపికి 12.90 పాయింట్లు రాగా, తెలంగాణాకు 59.95 పాయింట్లు వచ్చాయి. తర్వాత స్ధానాల్లో హరియాణా, పశ్చిమబెంగాల్, ఒడిస్సా, అస్సాం తదితర రాష్ట్రాలున్నాయి. పొరుగురాష్ట్రమైన కర్నాటక 36.56 పాయింట్లతో 8వ స్ధానం, 25.14 పాయింట్లతో తమిళనాడు 13వ స్ధానంలో నిలవటం గమనార్హం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మామూలు జనాలకు అర్ధం కాని పడికట్టు పదాలు ఎన్నో ఉపయోగిస్తున్నారు. అందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఒకటి.

ప్రపంచంలో ఏ దేశంలో పర్యటించినా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దేశం మొత్తం మీద ఏపినే బెస్ట్ అంటూ ఊదరగొడుతున్నారు. ప్రపంచంలోని పారిశ్రామివేత్తలందరూ ఏపివైపే పరుగులు తీస్తున్నారని తరచూ అంటూ ఉంటారు. విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ద్వారా లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని కూడా చెబుతుంటారు. మరి చంద్రబాబు చెప్పినదంతా నిజమే అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం 15వ ర్యాంకుకు ఎందుకు పడిపోయినట్లు?