కేంద్రప్రభుత్వానికి సంబంధించి తన మనసులోని మాటను ధైర్యంగా చంద్రబాబునాయుడు బయటపెట్టలేక పోతున్నారా? నిజమే అయితే అందుకు కారణాలేంటి? ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. విభజన హామీలను కేంద్రం తుంగలో తొక్కినా కేంద్రాన్ని చంద్రబాబు ధైర్యంగా నిలదీయలేకపోతున్నారు. ఒకరోజు తనలోని అసంతృప్తిని బయటపెట్టి వెంటనే మాట మార్చేస్తున్నారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. చాలా సార్లే జరిగింది. ఎందుకిలా చేస్తున్నారు? అంటే అందుకు ఢిల్లీ పరిణామాలనే అందరూ ఉదహరిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అవసరమైతే సుప్రింకోర్టుకు వెళతామని కలెక్టర్ల సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు. తర్వాత ఏమి జరిగిందో తెలీదుకానీ  వెంటనే మాట మార్చేశారు. అయితే, ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ డెలప్మెంట్ జరిగింది. అదేమిటంటే, శుక్రవారం ఉదయం చంద్రబాబు సుప్రింకోర్టుకు వెళతామని అన్నారు. అదే రోజు మధ్యహ్నం ఢిల్లీలో 20 మంది ‘ఆప్’ ఎంఎల్ఏలను ఎన్నికల కమీషన్ అనర్హులుగా ప్రకటించింది. లాభదాయక పదవులైన పార్లమెంటరీ కార్యదర్శులుగా ఉన్నారన్న ఏకైక కారణంతో వారిని ఇసి అనర్హులుగా ప్రకటించింది.

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పార్లమెంటరీ కార్యదర్శులుగా ఉన్నారు అన్నది చాలా చిన్న విషయం. ఎందుకంటే, వీరికన్నా ముందు భాజపా ఎంఎల్ఏలు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు కూడా పై పోస్టుల్లో ఉన్నారు. అప్పుడెవరినీ ఇసి అనర్హులుగా ప్రకటించలేదు. అంటే, ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ను కేంద్రప్రభుత్వం బాగా ఇబ్బంది పెడుతోంది. భాజపాను కాదని ఢిల్లీ జనాలు రెండుసార్లు కేజ్రీవాల్ కు పట్టం కట్టారు. అందులోనూ మొదటినుండి కేజ్రీవాల్ కూడా మోడి ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు. దాంతో కేజ్రీవాల్ పై ప్రధాని కక్షసాధింపులకు దిగుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

ఇక ఏపి విషయానికి వస్తే, మోడిని కాదంటే తన పరిస్ధితి కూడా కేజ్రీవాల్ లాగే తయారవుతుందేమో అన్న ఆందోళన చంద్రబాబులో మొదలైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ఇక్కడ చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు.  ఆ విషయంపై వైసిసి ఎన్నికల కమీషన్ వద్ద ఫిర్యాదు చేసింది. ఒకవేళ మోడిని కాదంటే వైసిపి ఫిర్యాదులపై ఇసి గనుక చర్యలకు దిగితే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే. అంతేకాకుండా ‘ఓటుకునోటు’ కేసు రూపంలో అంతకన్నా పెద్ద గండం చంద్రబాబు మెడపై వేలాడుతోంది. అందుకనే మోడి ముందు చంద్రబాబు అణిగిమణిగి ఉంటున్నారని వైసిపి ఆరోపణలు చేస్తోంది.