ఈ ఖర్చు మొత్తం ఎవరు చెల్లిస్తారనే విషయమై సర్వత్రా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వమే చెల్లిస్తుందని కొంతమంది, కాదని కొందరు వాదిస్తున్నారు. నిత్యమూ పారదర్శకత గురించి మాట్లాడే చంద్రబాబు ఏది నిజమో చెబితే బాగుంటుంది.
చంద్రబాబునాయుడు వ్యక్తిత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇతరలకు చెప్పేదొకటి తాను చేసేదొకటి. రాష్ట్రం చాలా పేదదని, కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలంటూ అనేకమార్లు చెప్పివుంటారు. కానీ అదే చంద్రబాబు మాత్రం ప్రజాధనాన్ని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెడుతుంటారు. ఇదంతా ఎందుకంటే, ఇప్పటి వరకూ హైదరాబాద్ లో చంద్రబాబు కుంటుంబం బస చేసిన విషయమై సర్వత్రా చర్చ మొదలైంది.
రోడ్డు నెంబర్ 65లో సొంత ఇల్లు సరిపోవటం లేదని చంద్రబాబు కొత్తది కట్టుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇంటిని ఖాళీ చేసేసారు. కొత్తది కట్టుకునే వరకూ మరి ఎక్కడుండాలి. ఎవరైనా అయితే, ఇంకో ఇల్లు అద్దెకు తీసుకుంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు కదా. అందుకనే ఇల్లు కాకుండా ఏకంగా హోటల్లోనే మకాం వేసారు. అది కూడా అలాంటిలాంటి హోటల్ కాదు. పార్క్ హయత్ అనే అత్యంత ఖరీదైన హోటల్. అందులో ప్రెసిడెన్షియల్ సూటే రోజుకు రూ. 1,14,750.
చంద్రబాబు కుటుంబానికి ఒక్క సూట్ సరిపోదు కదా? అందుకని ఏకంగా మూడు సూట్లు అద్దెకు తీసుకున్నారు. అంటే మూడు సూట్లకు కలిపి రోజుకు సుమారు రూ. 3,44,250. అద్దెకు కూడా ఏదో వారానికో నెలకో కాదు. కొత్త ఇల్లు పూర్తయ్యే వరకూ ఉండే పద్దతిలో తీసుకున్నట్లున్నారు. ఈ లెక్కన నెలకు సుమారు రూ. 1,03,27,500.(కోటి మూడు లక్షలు) 2016, మే నెలలో చంద్రబాబు కుటుంబం హోటల్ కు మారింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ అదే హోటల్లోనే ఉంటోంది. అంటే దాదాపు ఏడాది హోటల్ ఖర్చే సుమారుగా రూ. 12.39 కోట్లు.
ఈ ఖర్చు కేవలం ఉండేందుకు మాత్రమే. ఉదయం లేచింది మొదలు కాఫీ, టీలు తాగినదానికి, టిఫెన్, భోజనాలు చేసినందుకు మళ్ళీ వేరే. పైగా అతిధులు వస్తుంటారు కదా? అలాగే, సెక్యూరిటీ ఖర్చు ఉండనే ఉంది. ఇదంతా అదనం. ఈ ఖర్చులు కూడా వేసుకుంటే మరో రూ. 8 కోట్లు అదనం. దీన్ని బట్టే ఖర్చు ఏ స్ధాయిలో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ఇంతటి ఖరీదైన హోటల్లో తానుంటూ రాష్ట్రం పేదదంటే ఎవరు నమ్ముతారు? ఎందుకంటే, ఈ ఖర్చు మొత్తం ఎవరు చెల్లిస్తారనే విషయమై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వమే చెల్లిస్తుందని కొంతమంది, కాదని కొందరు వాదిస్తున్నారు. నిత్యమూ పారదర్శకత గురించి మాట్లాడే చంద్రబాబు ఏది నిజమో చెబితే బాగుంటుంది.
