పోటీ చేస్తానంటున్న నేతలకు అంత సీన్ లేదని కొందరు టిడిపి నేతలే తీసిపారేస్తున్నారు. అంటే దీని అర్ధమేమిటి? పులివెందులలో జగన్ను ఎదుర్కొనేందుకు టిడిపిలో సరైన అభ్యర్ధి లేరన్న విషయం అర్థమవుతోంది.

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుక టిడిపిలో అభ్యర్ధే దొరకటం లేదా? పరిస్ధితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే, జగన్ పై పోటీకి తాను సిద్ధమంటే తాను సిద్దమని ఇద్దరు నేతలు చెబుతుంటే, ఇంకోవైపేమో పోటీ చేస్తానంటున్న నేతలకు అంత సీన్ లేదని కొందరు టిడిపి నేతలే తీసిపారేస్తున్నారు. అంటే దీని అర్ధమేమిటి? పులివెందులలో జగన్ను ఎదుర్కొనేందుకు టిడిపిలో సరైన అభ్యర్ధి లేరన్న విషయం అర్థమవుతోంది.

పులివెందుల నుండి వచ్చే ఎన్నికల్లో పోటీచేసి జగన్ను తరిమేస్తానంటూ ఇటీవలే సతీష్ రెడ్డి సవాలు చేసారు. సహజంగా అయితే సవాలుకు సమాధానం చెప్పాల్సింది వైసీపీ. కానీ టిడిపి నుండే కౌంటర్ రావటం గమనార్హం. జగన్ పై గెలవకపోతే రాజకీయాల నుండి శాస్వతంగా తప్పుకుంటానని సతీష్ చెప్పటం అంతా ఉత్తదేనన్నారు. టిడిపికే చెందిన వేంపల్లె మండల మాజీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సతీషవి ఉత్త ప్రగల్బాలేనంటూ తేల్చేసారు.

పులివెందుల టిక్కెట్టు కోసమే సతీష్ డ్రామాలాడుతున్నట్లు ఎద్దేవాచేసారు. వరుసగా ఓడిపోతున్న సతీష్ కూడా సవాలు చేయటం ఏమీ బావోలేదన్నారు. నాలుగుసార్లు పోటీ చేసినా ఓడిపోవటం తప్ప సతీష్ సాధించింది లేమీ లేదని ఎద్దేవా చేసారు. ఇదిలావుండగా జగన్ కు సరైన పోటీ ఇచ్చేది తానేనంటూ పులివెందులకే చెందిన పార్ధసారధిరెడ్డి తెరపైకి వచ్చారు. అయితే, మిగిలిన అభ్యర్ధులు అంగీకరించటం లేదు. అదే విధంగా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, జెసి దివాకర్ రెడ్డిని పార్టీ నేతలు పోటీ చేయమని ప్రతిపాదిస్తే నవ్వేసి తప్పుకున్న సంగతి తెలిసిందే. అంటే జగన్ను ఎదుర్కొనేందుకు ధీటైన అభ్యర్ధి ఇప్పటికైతే టిడిపిలో లేరన్న విషయం అర్ధమవుతోంది కదా?