అధ్యక్షా..! ఇలా జగన్ చేత కూడా పిలిపించుకునే కూటమి ఎమ్మెల్యే ఎవరో..?
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం వేధించిన వైఎస్ జగన్ చేత 'అధ్యక్షా' అని ఎవరు పిలిపించుకుంటారో చూడాలని టిడిపి శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్... మిగతా మంత్రివర్గ ఏర్పాటుప్రక్రియ ముగిసింది. ఇక మిగిలింది ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం... అసెంబ్లీ స్పీకర్ ఎంపిక. జూన్ 19 నుండి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్దమయ్యింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొందరి పేర్లు స్పీకర్ రేసులో వున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వుంటుంది. ఇందుకోసం సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెంస్పీకర్ గా ఎంపిక చేస్తారు. ఇలా సీనియారిటీ ప్రకారం ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య వ్యవహరించే అవకాశం వుంది. మరికొందరు సీనియర్లకు కూడా ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం వుంది. చంద్రబాబు సర్కార్ ఎవరికి ప్రోటెం స్పీకర్ గా అవకాశం ఇస్తుందో చూడాలి.
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీని ఈ ఐదేళ్లు నడిపేది ఎవరు? అసెంబ్లీ స్పీకర్ గా చంద్రబాబు సర్కార్ ఎవరిని నియమిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రేసులో రెండుమూడు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరికి స్పీకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.
అయ్యన్నపాత్రుడు :
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు శాసనసభ స్పీకర్ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈయన పేరును దాదాపు ఖాయం చేసారని... అధికారిక ప్రకటనే మిగిలిందని టిడిపి వర్గాల సమాచారం. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేసిన అయ్యన్నకు ఈసారి కూడా మంత్రిపదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో చోటుదక్కలేదు. అయ్యన్నను అసెంబ్లీ స్పీకర్ ను చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోనట్లుగా తెలుస్తోంది.
గత ఐదేళ్ళు వైసిపి ప్రభుత్వాన్ని ఎదిరించి వైఎస్ జగన్ పై పోరాటంచేసిన వారిలో అయ్యన్నపాత్రుడు ఒకరు. ఆయనపై అనేక కేసులు నమోదుచేయడమే కాదు అరెస్ట్ కూడా చేసారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా టిడిపి తరపున పోరాటం చేసారు. ఇలా పార్టీకోసం కష్టపడ్డ సీనియర్ నాయకుడికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం అనుచరులు, టిడిపి శ్రేణులను నిరాశకు గురిచేసింది. కానీ ఆయనకు శాసన సభ స్పీకర్ పదవి దక్కనుందని తెలిసి వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయ్యన్నపాత్రుడు 1983లో అంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి మొదటిసారి ఎన్నికలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 1985,1994,1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన 2024 లో మళ్ళీ నర్సీపట్నం నియోజకవర్గం నుండి పోటీచేసి ఏకంగా 24,676 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇలా ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మండలి బుద్దప్రసాద్ :
ఇక ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ రేసులో వినిపిస్తున్న మరోపేరు మండలి బుద్దప్రసాద్. ఒకవేళ అసెంబ్లీ స్పీకర్ పదవి జనసేనకు దక్కితే అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్దప్రసాద్ కే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఆయనవైపే మొగ్గు చూసుతున్నారని తెలుస్తోంది. కుదిరితే స్పీకర్ లేదంటే డిప్యూటీ స్పీకర్... రెండిట్లో ఏదో ఒకటి మండలి బుద్దప్రసాద్ కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డిప్యూటీ సీఎం రేసులో వున్నది వీరే :
శాసన సభ స్పీకర్ కంటే డిప్యూటీ స్పీకర్ రేసులోనే ఎక్కువమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో పాటు పలువురు జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. కాబట్టి శాసనసభ స్పీకర్ పదవి వారికి దక్కకపోవచ్చనేది రాజకీయవర్గాల్లో చర్చ. దీంతో మండలి బుద్దప్రసాద్ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కొచ్చని అంటున్నారు.
బుద్దప్రసాద్ తో పాటు మరికొందరు జనసేన ఎమ్మెల్యేల పేర్లు కూడా డిప్యూటీ స్పీకర్ రేసులో వినిపిస్తున్నాయి. మహిళలకు అవకాశం కల్పించాలనుకుంటే లోకం మాధవికి అవకాశం వుంది. లేదంటే పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్ లలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి వరించవచ్చు. మొత్తంగా స్పీకర్ టిడిపి,డిప్యూటీ స్పీకర్ జనసేన నుండి వుండే అవకాశాలున్నాయి.