ప్రశ్నిస్తానంటూ రాజకీయల్లోకి వచ్చిన పవన్ ఎవరిని ప్రశ్నించాలి? ఎప్పుడు ప్రశ్నించాలన్న చిన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఎలా?
పవన్ కల్యాణ్ లెక్కలు ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రత్యేకహోదా కోసం శాంతియుత నిరసనకు దిగిన యువత హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్య ధక్షిణ భారతీయులందరినీ బాధించిందని చెప్పారు. అంశం రాష్ట్రానిదైతే మొత్తం ధక్షిణ భారతదేశాన్ని ఎందుకు కలుపుతున్నట్లో అర్ధం కావటం లేదు. సరే ఏదో కలిపారు అనే అనుకుందాం. ప్రభుత్వ చర్యకు నిరసనగామార్చిలో ‘ధక్షిణ భారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసన’ జరుపుతారట. అది కూడా మళ్ళీ విశాఖపట్నంలోని రామకృష్ణా బీచ్ లోనే.
విచిత్రమేమిటంటే, జనసేన ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయన్నారు. అంతేకానీ ఆ నిరసనలో తాను పాల్గొంటానని మాత్రం చెప్పలేదు. పోతే, జనవరి 26వ తేదీన ప్రభుత్వం యువత హక్కులను కాలరాస్తే, మార్చిలో శాంతియుత నిరసన చేయటమేమిటి? మధ్యలో ఫిబ్రవరి నెలంతా ఏమి చేస్తారు? కాటమరాయుడు షూటింగ్ లో బిజీనా? ఏ పార్టీ పట్లైనా ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందంటే బంద్ లేదా నిరసన చేయాలంటూ సదరు పార్టీ వెంటనే పిలుపిస్తుంది. మొన్న వైసీపీ చేసిందదేకదా? అంతే కానీ పవన్ లాగ నెల రోజుల ముందే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి మరీ నిరసన తెలపటం ఇదే మొదటిసారి.
26వ తేదీన కూడా నిరసన కార్యక్రమాల్లో తాను ఎక్కడా పాల్గొనలేదు. అందుకు పవన్ వివరించిన కారణాల్లో లాజిక్ లేదు. ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పటం పవన్ కు మొదటి నుండీ అలవాటే. ఇంతకీ వెంకయ్యనే జనసేనాని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు? ప్రత్యేకహోదా ఇవ్వాల్సింది నరేంద్రమోడి. సాధించాల్సింది చంద్రబాబు. వారిద్దరూ కలిసి నాటకాలాడుతున్నారు. హోదాను సాధించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఓటుకునోటు కేసు’ వల్ల మోడి ముందు సాగిలపడ్డారు.
ఓటుకునోటు కేసు ఉన్నంత కాలమూ చంద్రబాబు పరిస్ధితి అంతే. ఈ విషయాలు తెలిసీ పవన్ అటు మోడిని ఇటు చంద్రబాబును వదిలిపెట్టి వెంకయ్యపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నరో సమాధానం చెప్పాలి. అలాగే, తమ భూములను ప్రభుత్వం లాక్కుంటోందని రైతులు మొత్తుకుంటున్నా పట్టించుకోవటం లేదు. ప్రత్యేకహోదా అనేది కేంద్రం పరిధిలోనిది. మరి రాష్ట్రం పరిధిలోని రైతుల బాధను పవన్ ఎందుకు పట్టించుకోవటం లేదు? ప్రశ్నిస్తానంటూ రాజకీయల్లోకి వచ్చిన పవన్ ఎవరిని ప్రశ్నించాలి? ఎప్పుడు ప్రశ్నించాలన్న చిన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఎలా?
