గ్రామ, వార్డు సచివాలయాలు ఏమవుతాయో..? స్కూళ్లు, కాలేజీలకు డిజిటల్‌ అసిస్టెంట్ల బదిలీ!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం... గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఆ వ్యవస్థను అలాగే కొనసాగించాలా? లేక ఏమైనా మార్పులు చేయాలా? అన్న యోచనలో ఉంది.

What will happen to the village and ward secretariats? Transfer of digital assistants to schools and colleges! GVR

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఆచుతూచి అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవక ముందే ఒక్కరోజు వ్యవధిలో వాలంటీర్లు కూడా లేకుండా పింఛన్లు పంపిణీ చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి లబ్ధిదారుల ఇళ్లకు పింఛన్లు పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చెప్పుకొనే వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండానే పింఛన్ల పంపిణీ సునాయాసంగా పూర్తిచేశామని చెప్పారు. అలాగే, గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాల పేర్లను మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం... ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు తీసేయాలని ఆదేశాలిచ్చింది. ఇటీవలే రైతు భరోసా కేంద్రాలకు సైతం రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. 

తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం... జగన్‌ తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సమాంతరంగా తీసుకొచ్చిన ఈ వ్యవస్థ కారణంగా సర్పంచులకు విలువ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రమేయం ఎక్కువగా ఉండటంతో తమను పట్టించుకునేవారు లేరని సర్పంచులు బహిరంగంగానే అనేక సందర్భాల్లో చెప్పారు. పైగా సచివాలయ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలకు మేలు చేస్తుందన్న జగన్ ప్రభుత్వం... పంచాయతీలకు వచ్చే నిధులను ఎప్పటికప్పుడు దారి మళ్లించేసింది. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, గ్రాంట్లను గ్రామాల అభివృద్ధి, అవసరాలకు కాకుండా ఇతర పనులకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సర్పంచులు గడిచిన ఐదేళ్లూ ప్రభుత్వంపై పెద్ద పోరాటమే చేశారు. ఢిల్లీ వరకు వెళ్లి కేంద్రానికి ఫిర్యాదులు కూడా అందించారు. తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సర్పంచుల సంఘాలు.. వైసీపీ ఓటమి కోసం పనిచేశాయి.

ఇక, కొత్త ప్రభుత్వం... గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఆ వ్యవస్థను అలాగే కొనసాగించాలా? లేక ఏమైనా మార్పులు చేయాలా? అని ఆలోచిస్తోంది. ఇప్పటికే ఆ పనిలో పడ్డారు సంబంధిత శాఖ మంత్రి, అధికారులు. ఇటీవల సచివాలయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డోలా బాల వీరాంజనేయ స్వామి సైతం ఇదే విషయం చెప్పారు. గ్రామాల శివార్లలో నిర్మించిన సచివాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు. వాటితో పాటు అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధకారులకు ఆదేశాలిచ్చారు. 

ఈ నేపథ్యంలో తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయాల మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని వెలగపూడిలోని సచివాలయంలో వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులు కలిశారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ ప్రతినిధులు, రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయం అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. వాటిపై స్పందించిన సాధ్యమైనంత మంత్రి స్వామి.. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ద్వేయమని స్పష్టం చేశారు. విభిన్న ప్రతిభావంతులకు అందించే వినికిడి యంత్రాలు, ప్లాస్టిక్ పరికరాలను వైసీపీ ప్రభుత్వం నిలిపేసిందని తెలిపారు. గత ఐదేళ్లుగా ఏ ఒక్కరికీ పరికరాలు ఇవ్వలేదని విభిన్న ప్రతిభావంతులు మంత్రి దృష్టికి తీసుకురాగా... అర్హులైన వారందరికీ యంత్రాలు, ప్లాస్టిక్ పరికరాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. 

అలాగే, తమ సమస్యలు మంత్రికి విన్నవించుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు... గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల్లో పనిచేస్తున్న తమపై పనిభారం పెరిగిపోయిందని తెలిపారు. డిజిటల్ అసిస్టెంట్లపై పని భారం మరింత పడుతోందని వివరించారు. టెక్నికల్ స్కిల్స్ అధికంగా ఉన్న తమను పాఠశాలలు, కాలేజీల్లో టెక్నికల్  విధులకు సంబంధించి వినియోగించుకోవాలని డిజిటల్ అసిస్టెంట్లు కోరారు. అలాగే, గౌరవప్రదమైన వేతనం అందించాలని మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి స్వామి... గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నూతన విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios