అమరావతి: పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా  మాట్లాడితే  సహించేది  లేదని బీజేపీ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. అమరావతి వ్యవహారం కేంద్రం పరిధిలో ఉందని మాజీ కేంద్ర మంత్రి సుజానా చౌదరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు తప్పుబట్టారు. పార్టీ నిర్ణయానికి విరుద్దంగా సుజనా చౌదరి వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ప్రకటించారు.

అమరావతిలోనే రాజధాని ఉండాలనేది తమ పార్టీ అభిప్రాయమని బీజేపీ ప్రకటించింది. పార్టీ విధానానికి విరుద్దంగా మాట్లాడితే సహించేది లేదనే సంకేతాలు ఇచ్చింది కమలదళం.

చిన్నతనం నుండి సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏబీవీపీ తర్వాత  బీజేపీలో  సుధీర్ఘ కాలం పాటు సోము వీర్రాజు కొనసాగుతున్నారు. పార్టీ  సిద్ధాంతాలను ఆచరిస్తారు. పార్టీ తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఆయనకు పేరుంది. అయితే అదే సమయంలో పార్టీని రాష్ట్రంలో బలోపేతం కావాలనేది ఆయన కోరిక.

పార్టీని బలోపేతం చేసేందుకు గాను దూకుడు స్వభావం ఉన్న వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ప్రయోజం ఉంటుందని జాతీయ నాయకత్వం భావించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించారు.

అయితే అదే సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న నేతలపై కమలదళం వల వేయనుంది.

also read:దెబ్బ మీద దెబ్బ కొట్టాడు: చంద్రబాబుపై సోము వీర్రాజు సంచలనం

2019 ఎన్నికల తర్వాత మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు బీజేపీలో చేరారు.బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నేతలు టీడీపీ కోసం పనిచేస్తున్నారని వైసీపీ నేతలు గతంలో అనేక ఆరోపణలు చేశారు.

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన నేతలకు కమల దళం షోకాజ్ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. విశాఖపట్టణానికి చెందిన తురగ శ్రీరామ్ వారం రోజుల క్రితం  బీజేపీకి రాజీనామా చేశారు.

టీవీ చర్చల్లో పాల్గొన్నందుకు ఆయను పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. టీవీ చర్చల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా కూడ షోకాజ్ నోటీసు ఇవ్వడంపై  అసంతృప్తితో  బీజేపీకి రాజీనామా చేశారు.

మీడియాతో మాట్లాడే సమయంలోనూ టీవీ చర్చా కార్యక్రమాల్లో కూడ ఇక జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్విట్టర్ వేదికగా చేసిన ప్రకటనతో తేలింది. 

ఒకవేళ ఉద్దేశ్యపూర్వకంగా మాట్లాడకపోయినా.... పొరపాటునో.. ఇతరత్రా కారణాలతో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని బీజేపీ నాయకత్వం తేల్చి చెప్పింది.