అమరావతి:రాష్ట్రంలో తాము రాజకీయంగా  బలోపేతం కాకుండా చంద్రబాబునాయుడు దెబ్బ మీద దెబ్బ కొట్టాడని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు విమర్శించారు.

గురువారం నాడు  ఆయన  ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో తమ పార్టీ ఎదగలేదన్నారు. బీజేపీని చంద్రబాబునాయుడు ఏం చేశారో పార్టీ హైకమాండ్‌కు తెలుసునని ఆయన చెప్పారు. 

టీడీపీతో పొత్తు విషయమై తాను మాట్లాడనని చెప్పారు. ఈ విషయమై మోడీ, అమిత్ షా చెబుతారని చెప్పారు. అవసరాన్ని బట్టి బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకొంటారని ఆయన సెటైర్లు వేశారు. 

ఏపీ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందన్నారు. తమ ప్రభుత్వంలో అవినీతి చోటు చేసుకోలేదని.... అన్ని పారదర్శకంగానే చేశామని చంద్రబాబునాయుడు చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో అరెస్టులు చేస్తే బీసీలు అంటారా అని ఆయన ప్రశ్నించారు. బీసీలే కాదు రెడ్లను కూడ అరెస్ట్ చేశారని సోము వీర్రాజు గుర్తు చేశారు.

శాసనమండలి రద్దు చేస్తామని చెప్పిన వైసీపీ... మండలికి కొత్తగా సభ్యులను పంపిందన్నారు.  మండలిని రద్దు చేస్తామనే ఆలోచన నుండి వైసీపీ వెనక్కి తగ్గినట్టుగా కన్పిస్తోందన్నారు. వెనక్కు తగ్గకపోతే కొత్త సభ్యులను మండలికి ఎందుకు పంపుతోందోనని ఆయన ప్రశ్నించారు.

also read:సోము వీర్రాజుకు బీజేపీ చీఫ్ పదవి: కమల దళం వ్యూహామిదే...

చంద్రబాబునాయుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని చేసిన తప్పునే జగన్ కూడ చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబుపై తాను పోరాటం చేస్తాననే ప్రచారం సరైంది కాదన్నారు.

కన్నా లక్ష్మీనారాయణను తప్పించిన తనను నియమించలేదన్నారు. కన్నా తర్వాతే తనను ఈ పదవిలో నియమించినట్టుగా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.అభివృద్ధి ఎజెండాగా  తమ పార్టీ ముందుకు సాగుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి తప్పును ఎండగడుతామని ఆయన స్పష్టం చేశారు.