అమరావతి: ఆమరావతి విషయంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి వ్యాఖ్యలు వ్యూహాత్మకమా... మైండ్ గేమ్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూల్ లో జ్యూడీషీయల్ కేపిటల్, అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

అయితే మూడు రోజుల క్రితం మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అమరావతిలో కూడ శాసన రాజధానిని కూడ ఎత్తేసే ప్రయత్నాలకు ఊతమిచ్చేలా ఉన్నాయని విపక్షాలు విమర్శలు చేశాయి.

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఈ ప్రాంతానికి చెందిన రైతులు 260 రోజులకు పైగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ పేరుతో రైతులు కోర్టును ఆశ్రయించారు. మూడు రాజధానులపై ముందుకు సాగకుండా ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.

అమరావతిలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలకు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడడాన్ని మంత్రి కొడాలి నాని తప్పుబట్టారు.  అమరావతిలో  పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకొంటే .. ఇక్కడ శాసన రాజధాని కూడ అవసరం లేదని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ తో కూడ చెప్పానన్నారు. ఈ విషయమై అందరితో మాట్లాడుదామని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు.

అమరావతి విషయంలో ప్రభుత్వంపై కేసులు వేస్తున్న రైతులను తమ దారికి తెచ్చుకొనే వ్యూహాంలో భాగంగా కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారా ... ప్రభుత్వం ఇదే ఉద్దేశ్యంతో ఉందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అమరావతి చుట్టుపక్కల చంద్రబాబునాయుడుకి చెందిన సామాజిక వర్గానికి చెందిన వారికి భూములు ఉన్నాయని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే  పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను అమరావతిలో ఇస్తామంటే ఇవ్వకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది.

 తమ ప్లాన్ ఫలిస్తే అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనలకు పోటీగా ఇళ్ల పట్టాల కోసం పేదలు కూడ ఆందోళనలు చేస్తే రాజకీయంగా వైసీపీకి కలిసి రానుంది. అదే జరిగితే విపక్షాలకు ముఖ్యంగా టీడీపీకి ఇబ్బందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని తెర మీదికి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమరావతి నుండి రాజధానిని తప్పించే కుట్రతోనే మూడు రాజధానుల అంశాన్ని జగన్ సర్కార్ తెరమీదికి తెచ్చిందని ఆరోపించే వారు కూడ లేకపోలేదు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కొందరు విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. 

ఒక్క సామాజిక వర్గానికే టీడీపీ కొమ్ము కాస్తోందని చెప్పేందుకు ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చారా అనే చర్చ కూడ లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయింది.

ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో టీడీపీని దోషిగా చూపేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే పేదలకు ఉపయోగకరం లేని భూములను ఇళ్ల పట్టాలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని తాము అడ్డుకోవడం లేదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.